నార్పల: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా పర్యటన ఖరారు అయ్యింది. ఈ నెల 17వ తేదీన ఆయన నార్పలకు రానున్నారు. నార్పలలో నిర్వహించ బహిరంగ సభ వేదిక నుంచి విద్యార్థుల వసతిదీవెన నగదును వారి ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను కలెక్టర్ ఎమ్.గౌతమి ఆధ్వర్యంలో మంగళవారం నాడు పరిశీలించారు. ఎమ్మెల్సీ తలశిల రఘురాం, జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్, అనంతపురం ఆర్డీవో మధుసూదన్, ప్రభుత్వ విద్యాసలహాదారుడు ఆలూరు సాంబశివా రెడ్డి, అడిషినల్ ఎస్పీ నాగేంద్రుడు, డీఎస్పీ ప్రసాద్ రెడ్డితో కలిసి హెలీప్యాడ్, బహిరంగ సభ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు వారం రోజులు కూడా గడువు లేనందున యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బహిరంగ సభకు పెద్ద ఎత్తున వచ్చే వాహనాలకు పార్కింగ్ సౌకర్యం, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సభ నిర్వహించుకునేందుకు అనువైన విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పైలా నరసింహాయ్య, వైసీపీ సీనియర్ నాయకులు నార్పల సత్యనారాయణ రెడ్డి, మండల కన్వీనర్ నిట్టూరు రఘునాథరెడ్డి, జడ్పీ వైస్ ఛైర్‌పర్సన్ నాగరత్నమ్మ, ఎంపీపీ నాగేశ్వరరావు, తహశీల్దార్ నారాయణస్వామి, ఎంపీడీవో దివాకర్, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి మిద్దె కుళ్లాయప్ప తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్లో సమీక్ష
అనంతపురం కలెక్టరేట్ : మఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అనంతపురం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్సులో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులతో ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. అందరూ సమన్వయంతో పని చేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, డీఆర్వో గాయత్రీ దేవి, అడిషనల్ ఎస్పీ నాగేంద్రుడు, ఆర్డీవో మధుసూదన్, ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ ఓబుల్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విశ్వమోహన్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ భాగ్యరాజ్, డీటీసీ శివరామప్రసాద్ పాల్గొన్నారు.










