
* ఎస్‌పి జి.ఆర్ రాధిక
ప్రజాశక్తి - శ్రీకాకుళం: హిట్ అండ్ రన్ కేసులో వాహనాలు గుర్తించేందుకు అవసరమైన సిసి కెమెరాలను ముఖ్యమైన కూడళ్లలో ఏర్పాటు చేయాలని ఎస్‌పి జి.ఆర్ రాధిక అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా నగరంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను గురువారం సందర్శించారు. ముందుగా పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. శ్రీకాకుళం నగరం కేంద్రంగా ఉన్న ట్రాఫిక్ పాయింట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారిని గుర్తించి జరిమానాలు వేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడేపే వారిపై ప్రత్యేక దృష్టిసారించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. దర్యాప్తు పెండింగులో ఉన్న ప్రతి కేసును పరిష్కరించాలన్నారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్ పాయింట్లు పెంచి ప్రమాదాలు సంభవించకుండా నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న చోట బారికేడ్లు ఏర్పాటు చేసి, అతి వేగ డ్రైవింగ్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి సురక్షిత ప్రయాణానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో, సరైన వాహన పత్రాలు లేక పట్టుబడిన వాహనాలను కోర్టు ఆదేశాల మేరకు వీలైనంత వేగంగా డిస్పాజిల్ చేయాలని సూచించారు. ఆమె వెంట ట్రాఫిక్ డిఎస్‌పి ప్రసాదరావు, ఎస్‌ఐ రమణ, ఎస్‌పి సిసి శివకుమార్ ఉన్నారు.