Sep 03,2022 23:11

పోలీసులు అదుపులో ట్రాన్స్‌ఫార్మర్‌ దొంగలు.

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌
చిత్తూరు జిల్లాలో పలుచోట్ల ఇటీవల కాలంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు చోరీపై పోలీసులు ప్రత్యేకంగా దష్టి సారించారు. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు చిత్తూరు డిఎస్‌పి సుధాకర్‌ రెడ్డి పర్యవేక్షణలో చిత్తూరు రూరల్‌ ఈస్ట్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మద్దయ్యఅచారికి అందిన సమాచారం మేరకు .రామక్రిష్ణ, సబ్‌ ఇన్స్పెక్టర్‌, చిత్తూరు తాలూకా అనిల్‌ కుమార్‌, సబ్‌ ఇన్స్పెక్టర్‌, పెనుమూరు సిబ్బందితో చిత్తూరు జిల్లా, పెనుమూరు మండలము, కలవకుంట జలాశయం డ్యామ్‌ సమీపంలోని ముళ్ళచెట్ల పొదల వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తూ మోటార్‌ సైకిల్‌పై గోనె సంచులను పెడుతూ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. పారిపోతున్న తమిళనాడుకు చెందిన నాగరాజు, సుబ్రమణ్యం కలైకుమార్‌, జయకుమార్‌ ముగ్గుర్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ఒక మోటార్‌ సైకిలులో తమిళనాడు నుండి చిత్తూరు గ్రామాలవైపు తిరుగుతూ వ్యవసాయ పొలాల్లో బిగించి ఉన్న ప్రభుత్వ ట్రాన్స్‌ఫార్మర్‌ చూసుకొని రాత్రివేళలో రాగి వైరును దొంగిలించుకొని వాటిలో కొంత అమ్మి మిగిలినవి గోనె సంచులలో దాచి పెనుమూరు మండలము, జలాశయానికి ఉత్తరముగా ఉన్న ముళ్ళ పొదలలో దాచామని చెప్పారు. ముద్దాయిల వద్ద నుండి పది లక్షల విలువచేసే సుమారు 250 కేజీల రాగి వైరును, నేరానికి ఉపయోగించిన ఒక ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ముద్దాయిలపై జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో ఏడుకు పైగా చోరీ కేసులున్నట్లు చిత్తూరు డిఎస్‌పి సుధాకర్‌రెడ్డి తెలిపారు.