Sep 03,2023 21:30

మహాసభల్లో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌

          ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మూఢనమ్మకాలు, అశాస్త్రీయ అంశాలు కోర్సులుగా పెట్టి మతోన్మాదాన్ని పెంచి పోషిస్తోందని జనవిజ్ఞాన వేదిక నాయకులు విమర్శించారు. ఆదివారం కళ్యాణదుర్గంలోని డిగ్రీ కళాశాలలో జనవిజ్ఞాన వేదిక అనంతపురం జిల్లా 17వ మహాసభలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జెవివి జెండాను సీనియర్‌ నాయకులు రామాంజనేయులు ఆవిష్కరించారు. అనంతరం ప్రజాసైన్స్‌ ఉద్యమంలో అసువులు బాసిన ఈశ్వరయ్య, పెద్దన్న, జయం బాలకృష్ణ, జంపా కృష్ణకిషోర్‌, మణికి సంతాపం ప్రకటించారు. తర్వాత ఇటీవల మరణించిన గద్దర్‌, జహిరుద్దీన్‌తోపాటు పలువురు సినీ కళాకారులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రతినిధుల సభలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌, జెవివి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ రంగన్న మాట్లాడుతూ ప్రజాసైన్స్‌ ఉద్యమంలో 38 ఏళ్లుగా జన విజ్ఞాన వేదిక రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను శాస్త్ర విజ్ఞానం వైపు మళ్లించిందన్నారు. ముఖ్యంగా మూఢనమ్మకాలు, అక్షరాస్యత, మద్యపాన నిషేధానికి ఎనలేని కృషి చేసిన ఘనత జెవివికే దక్కిందన్నారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం డార్విన్‌ పరిణామ సిద్ధాంతం, పీరియాడిక్‌ టేబుల్‌ సహా పలు రకాల సైన్స్‌ పాఠాలు తొలగించడం బాధాకరమన్నారు. అలాగే శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి, పరిశోధనలకు తగిన నిధులు మంజూరు చేయకపోడం తగదన్నారు. చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతంతో శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. కాగా సంక్షోభంలోఉన్న జిల్లా వ్యవసాయ, చేనేత రంగాలను ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. రానున్న కాలంలో జెవివి బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెవివి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భాస్కర్‌ కంచె లక్ష్మీనారాయణ, సమత, విభాగం కన్వీనర్‌ డాక్టర్‌ ప్రసూన, ఆహ్వాన కమిటీ నాయకులు కంబాల తిమ్మారెడ్డి, చల్లా కిషోర్‌ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.