Jul 12,2023 17:52

ప్రజాశక్తి - పెనుమంట్ర
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యార్థి సంగ్రామ సైకిల్‌ యాత్ర మూడో రోజు బుధవారం ఉదయం పెనుగొండలో ప్రారంభమైంది. మార్టేరు మీదుగా ఆలమూరు, పెనుమంట్ర చేరుకుంది. అనంతరం పెనుమంట్ర హైస్కూల్లో సభ నిర్వహించారు. సాయంత్రానికి యాత్ర అత్తిలి చేరుకుంది. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కార్యదర్శులు పి.వాసు, డి.పెద్దిరాజు ఈ బృందానికి నాయకత్వం వహించారు. కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు కె.విజరుకుమార్‌, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కె.పద్మా నేతృత్వంలో సైకిల్‌ యాత్రకు ఘన స్వాగతం పలికారు. అనంతరం యాత్ర బృందం స్థానిక జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు టి.ప్రసాద్‌ మాట్లాడుతూ పాఠశాలలో మరుగుదొడ్లు లేకపోవడం దుర్మార్గమన్నారు. స్వచ్ఛభారత్‌ అని ప్రచారం చేసే ప్రభుత్వం విద్యార్థులకు కనీసం మరుగుదొడ్లు నిర్మించలేక పోతోందని విమర్శించారు. దీనివల్ల విద్యార్థులు వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే మరుగుదొడ్లు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కమిటీ సభ్యుడు సాగర్‌ మాట్లాడుతూ పెనుమంట్ర హైస్కూల్లోనే జూనియర్‌ కాలేజీ మార్చారు గానీ వారికి లెక్చరర్‌ నియమించడం లేదని ఫలితంగా నాణ్యమైన చదువు విద్యార్థులకు ఎలా అందిస్తుందని ప్రశ్నించారు. జూనియర్‌ కాలేజీల్లో ఖాళీగా ఉన్న కొత్త పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కె.ఈశ్వర్‌, నాని, సూరజ్‌, సాయి పాల్గొన్నారు.
పెనుగొండ : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు పి.వాసు తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ సంగ్రామ సైకిల్‌ యాత్ర మూడోరోజు బుధవారం పెనుగొండ జెడ్‌పిహెచ్‌ స్కూల్‌ నుంచి ప్రారంభమై ఎస్‌వికెపి అండ్‌ కెఎస్‌.రాజు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో సభలో వాసు మాట్లాడారు. జిఒ 77 రద్దు చేయాలని, పీజీ విద్యార్థులకు విద్యా దీవెన అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని లేకపోతే, తాడేపల్లిలోని సిఎం ఇంటిని ముట్టడిస్తామన్నారు. హాస్టల్‌ విద్యార్థులకు కాస్మెటిక్‌ ఛార్జీలు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.