మట్టి ప్రతిమల వినియోగం కొంతే..!
కొరవడుతున్న చైతన్యం
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి:
వినాయక చవితి.. ఈ పండుగ అంటేనే పిల్లల దగ్గర నుంచి పెద్ద వరకు ఆసిక్తి ఎక్కువ. అందరూ వినాయకుని ప్రతిమలు కొనుక్కొని వాటికి పూజలు చేసి పండగ చేసుకుంటారు. రంగు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలు వద్దు అని ఎంత మంది చెప్పినా పెద్దగా ఎవరికి చెవికెక్కడం లేదు. ఇలాంటి మాటలు విని గాలికొదిలేస్తున్నారు. కొందరు మాత్రమే మట్టి విగ్రహాలకే ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు వీటిని ఉచితంగా పంపిణీ చేస్తూ సూర్తి నింపుతున్నారు. కాగా నేడు వినాయక చవితి కావడంతో అందరూ మట్టి విగ్రహాలే కొనుగోలు చేయాలని ఆశిద్దాం.
పర్యావరణనానికి హాని..
వినాయక విగ్రహాలన్నీ కొన్ని సంవత్సరాలుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసేవారు. అంతేకాకుండా కొన్ని విగ్రహాలకు హానికరమైన రంగులు లేసి అమ్మేవారు. పూజలు ముగిసిన తరువాత వీటిని చెరువులు, బావుల్లో నిమర్జనం నిర్వహించడం ఆనవాతీగా వస్తోంది. దీనివల్ల వాతావరణ కాలుష్యంతో పాటు, నీళ్లు కూడా కలుషితమవుతున్నాయి. ఈ సందర్భంగా పర్యావరణ ప్రేమికులు చేస్తున్న విజ్ఞప్తి గాలిలో కలసిపోతోంది.
ప్రకృతికి విరుద్ధంగా ..
రంగు విగ్రహాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వినియోగం ఒక ఎతైతే నిమ్మజనం సమయంలో ప్రకృతికి విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. డిజె సాంగ్స్ పెట్టి దానికి డాన్సులు వేయడం, రంగులు చల్లుకోవడం, టపాకాయలు కాల్పడం వంటి చేస్తూ ప్రకృతికి విరుద్ధంగా, దానికి హానికల్పిస్తున్నారు. దీంతో వాతావరణం కలుషితమవుతోంది. దీనిని అరికట్టాలని చాలా మంది కోరుతున్నారు. నేటి నుంచి కొన్ని ప్రాంతాల్లో మూడు, ఐదు రోజులు కొన్ని ప్రాంతాల్లో తొమ్మిది రోజులు విగ్రహాలను పెడుతున్నారు.
పర్యావరణాన్ని కాపాడుదాం..
కాగా జనవిజ్ఞాన వేదిక, ప్రకృతి ప్రేమికులు కొందరు మట్టి విగ్రహాలను పంచుతూ అందరికీ సూర్తిగా నిలుస్తున్నారు. ప్రకృతిహితంగా పండుగ చేసుకుందా అని ప్రచారం చేస్తున్నా వారి ఆలోచననకు మన ఆచరణ కూడా తోడు కావాల్సిన సమయం ఇది. వారి బాటలో పయనిస్తే ప్రకృతికి మేలు చేసినట్లు అవుతుంది. పర్యావరాణాన్ని కాపాడినట్లు అవుతుంది.
మట్టి విగ్రహాలనే వాడుదాం..
విషపూరితమైన రసాయనాలు, రంగులతో ఉంచే విగ్రహాలను చెరువులు, బావుల్లో కలపడం వల్ల వాతావరణం దెబ్బతింటుంది. ప్రకృతి సిద్ధంగా వినాయకున్ని పూజించటంలో భాగంగా మట్టి విగ్రహాలనే వాడుదాం.
- బయోడైవర్శిటీ సుధాకర్, జెవివి నాయకులు










