Oct 11,2023 21:09

మాట్లాడుతున్న సిపిఎం నాయకులు

మాట్లాడుతున్న సిపిఎం నాయకులు
మత్స్య కారేతర ప్యాకేజీ
బకాయిలను వెంటనే చెల్లించాలి
ప్రజాశక్తి-వెంకటాచలం:మత్స్యకారేతర ప్యాకేజీ బకాయిలను వెంటనే చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.మోహన్‌రావు డిమాండ్‌ చేశారు. బుధవారం ముత్తుకూరు మండలంలో సిపిఎం పాదయాత్ర బందం పంటపాలెం ముత్తుకూరు, మామిడిపూడి, నేలటూరు ,పైనాపురం గ్రామాలలో పర్యటించింది. ముత్తుకూరులోని శ్రామిక భవన్‌ సిఐటియు కార్యాలయం వద్ద సిఐటియు జెండాను సిఐటియు జిల్లా కోశాధికారి కె. పెంచల నరసయ్య ఆవిష్కరించారు. ముత్తుకూరు ఆర్టీసీ బస్టాండ్‌ సెంటర్లో ఆటో వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు తాండ్ర శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆటో కార్మికులు పాదయాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ముత్తుకూరు సెంటర్లో సభ జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. మోహన్‌ రావు, గోగుల శ్రీనివాసులు, సిఐటియు జిల్లా అధ్యక్షులు టివివి ప్రసాద్‌, ఆలూరు తిరుపాలు, టి శివకుమారి, గడ్డం అంకయ్య, తదితరులు ప్రసంగించారు.

మత్స్య కారేతర ప్యాకేజీ బకాయిలను వెంటనే చెల్లించాలని, కాలుష్యపు కోరల్లో చిక్కుకున్న గ్రామాల ప్రజలకు నష్టపరిహారంగా ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, నెలకు రూ.3వేలు ప్యాకేజీని అందించాలని డిమాండ్‌ చేశారు. కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పరిశ్రమలలో కార్మిక చట్టాలను అమలు చేయాలని, స్థానికులకు ఉపాధి కల్పించాలని, పరిశ్రమల కోసం సేకరించిన భూములలో వెంటనే పరిశ్రమలు నిర్మించాలని లేదా ఆ భూములను రైతులకు తిరిగి అప్పగించాలని డిమాండ్‌ చేశారు.అన్ని గ్రామాలలో వందలాది మంది మహిళలు పాదయాత్ర బందానికి ఘనంగా స్వాగతం పలికారు. సిపిఎం నాయకులు నక్క రాధయ్య, కాల్తిరెడ్డి రమణమ్మ, కొండా ప్రసాద్‌, ఆటో యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఎంవి రాజా పాల్గొన్నారు.