గుంతకల్లు : స్వార్థ రాజకీయాల కోసం దేశంలో కులం, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి మతవిద్వేషాగ్ని రగులుస్తున్న మతోన్మాద బిజెపికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి ఇంటికి పంపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ పిలుపునిచ్చారు. విభజన హామీల అమలు, రైల్వే జోన్ ఏర్పాటు, కేంద్ర విశ్వవిద్యాలయానికి నిధులు తదితర సమస్యల పరిష్కారంపై బిజెపి అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచారభేరీ యాత్రను సోమవారం నాడు గుంతకల్లు రైల్వే డివిజనల్ మేనేజర్ కార్యాలయం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి పట్టణంలోని పొట్టి శ్రీరాములు కూడలి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాంభూపాల్‌తో పాటు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి.గోవిందు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి రాకముందు రాష్ట్రానికి అనేక హామీలు ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు గడచినా ఇప్పటికీ ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. తొమ్మిదేళ్లగా ప్రజలను అడుగడుగునా బిజెపి మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కూటమి దేశంలో మత ఘర్షణలను సష్టిస్తూ మత విద్వేషాలను సృష్టించే కుట్ర చేస్తోందన్నారు. పేదలను విస్మరించి అదానీ,అంబానీల సేవల్లో మునిగి తేలుతూ దేశ సంపదను వారికి దొచిపెడుతోందన్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు పరం చేస్తోందన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ హామీ, రూ.15 లక్షల కోట్ల నల్ల ధనం ఏమైనాయని ప్రశ్నించారు. కేంద్రం తీరును ఎండగడుతూ ఈ నెల 30వ తేదీ వరకు సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రచారభేరీ కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు, మండల కార్యదర్శి దాసరి శ్రీనివాసులు, సిపిఐ పట్టణ కార్యదర్శి గోపినాథ్, సహాయ కార్యదర్శి ఈశ్వరయ్య, సిపిఎం పట్టణ కార్యవర్గ సభ్యులు మారుతీప్రసాద్, సాకే నాగరాజు, కసాపురం రమేష్, జగ్గలి రమేష్, తిమ్మప్ప, ఓబులేసు, మస్తాన్, ప్రసాద్‌బాబు, ఖాదర్ బాషా, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వెంకీ, కిషోర్ సమీర్ పాల్గొన్నారు.










