సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిగురుపాటి బాబూరావు,
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
ప్రజావ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బిజెపిని సాగనంపాలని, మోడీ నుంచి దేశాన్ని కాపాడాలని ఈ నెల 14 నుంచి 30వ తేదీ వరకూ చేపడుతున్న ప్రచారభేరి యాత్ర ముగింపు సభ శుక్రవారం పట్టణంలో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ఎన్‌కె గ్రౌండ్‌లో సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం, సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అధ్యక్షతన జరిగింది. ఈ బహిరంగ సభకు ముఖ్య వక్తలుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిగురుపాటి బాబూరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి, దేశ లౌకికతత్వాన్ని దెబ్బతీస్తూ అట్టడుగు వర్గాలవారిపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోరి బిజెపి ప్రభుత్వం పూర్తిగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులివ్వకపోవడం దుర్మార్గమన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకానికి పెట్టి మోడీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాలు, ఎరువులు, ఔషధాల ధరలను పెంచిందన్నారు. పట్టణ ప్రజలంతా బిజెపి ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, ఈ దేశం నుండి బిజెపిని, ఈ పార్టీతో జతకట్టిన పార్టీలను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిగురుపాటి బాబూరావు మాట్లాడుతూ ఢిల్లీలో మోడీ, ఆంధ్రప్రదేశ్‌లో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలో ఉన్న మన దేశం, ఆకలి చావుల్లో, దారిద్య్రంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. మోడీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా జతకట్టిన పార్టీలను రాష్ట్రం, దేశం నుండి తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మోడీ దేశాన్ని, దేశ సంపదను, ప్రజలను కొల్లగొట్టి అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పుణ్యమా అని ప్రజల దగ్గర డబ్బుల్లేక, కొనుగోలు శక్తి లేక, ఆదాయాల్లేక, పనుల్లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా, రైతు, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం, ప్రతిపక్షాలైన టిడిపి, జనసేన మోడీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించి పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అచ్ఛేదిన్ తీసుకొస్తానని ప్రచారం చేసి గద్దెనెక్కిన మోడీ ప్రభుత్వం ప్రజలకు చచ్చేదిన్ తీసుకొచ్చిందన్నారు. మోడీకి దేశాన్ని పాలించే అర్హత లేదని విమర్శించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కనీసం పాత్రలేని వారు దేశాన్ని పాలించడం సిగ్గుచేటన్నారు. బిజెపి ప్రజల కష్టాల గురించి పట్టించుకోకుండా కేవలం మతం పేరుతో ప్రజలను చీల్చి అధికారంలోకి వచ్చిందన్నారు. మోడీ దేశాన్ని కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెడుతున్నారని విమర్శించారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను, అంబానీ, అదానీలకు కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలను నియంత్రిస్తాం, రైతాంగాన్ని ఆదుకుంటాం, స్వర్ణ భారతాన్ని సాధిస్తామని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్ల కాలంలో దేశాన్ని అట్టడుగుస్థాయికి తీసుకెళ్లిన ఘనత మోడీదేనని తెలిపారు. కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతకాయల బాబూరావు, సిపిఐ రాష్ట్ర నాయకులు నెక్కంటి సుబ్బారావు, కలిశెట్టి వెంకట్రావు, సిపిఎం జిల్లా నాయకులు జెఎన్‌వి గోపాలన్, కె.రాజారామ్మోహన్ రారు, డి.కళ్యాణి, సిపిఎం పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, సిపిఎం పెంటపాడు మండల కన్వీనర్ చిర్ల పుల్లారెడ్డి, సిపిఐ జిల్లా నాయకులు సీతారాం ప్రసాద్, సిపిఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, ఎఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.సోమసుందర్, సిపిఐ జిల్లా నాయకురాలు సికిలే పుష్పకుమారి పాల్గొన్నారు.
ఆకివీడు : దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, బిజెపిని ఓడించాలని కోరుతూ సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ప్రచార భేరి కార్యక్రమం శుక్రవారం పట్టణంలో నిర్వహించారు. వెలమపేట, తీగలు, దొడ్డి రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఈ ప్రచారం సాగింది. అధిక ధరల నుండి దేశాన్ని కాపాడాలంటే అందరూ సమైక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి కె.తవిటి నాయుడు, నాయకులు పెంకి అప్పారావు, బి.వర్మ, షేక్ వలీ, గేదెల విజయ లావణ్య, నల్ల శ్యామ్, బైరి కళ్యాణి, ఎస్‌కె.అమ్మాజీ, మువ్వా శ్రీను, జి.రాము పాల్గొన్నారు.










