ప్రజాశక్తి-ఉండి : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్ ను పదవి నుంచి తొలగించి వెంటనే అరెస్టు చేయాలని సిఐటియు మండల కార్యదర్శి కొట్టాడ వెంకటేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర కమిటీ పిలుపుమేరకు ఉండి మెయిన్ సెంటర్లో గురువారం రెజ్లర్లకు మద్దతుగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొట్టాడ వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా నాయకులు ధనికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ భారత రెజ్లర్లను లైంగికంగా వేధిస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్న బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా గత 40 రోజుల నుంచి రెజ్లర్లు ఢిల్లీలో నిరసన తెలియజేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. బ్రిజ్ భూషణ్ రాజకీయ జీవితం అనేక వివాదాలమయమని గతంలో దావూద్ ఇబ్రహీం ముఠాకు చెందిన వారికి ఆశ్రయం ఇచ్చారనే కేసు కూడా అతనిపై కొంతకాలం నడిచిందని అటువంటి వ్యక్తికి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష పదవి ఏ విధంగా కట్టబెట్టారని విమర్శించారు. ఇప్పటికైనా రెజ్లర్లు చేస్తున్న నిరసనకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి బ్రిజ్ భూషణ్ ను పదవి నుంచి వెంటనే తొలగించాలని లేనిపక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళనను ఉధృతం చేస్తామని వారు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మజ్జి నాగేశ్వరరావు, కడలి నాగేశ్వరరావు, కట్టా రవి, జుత్తిగ లకుడు తదితరులు పాల్గొన్నారు.










