మసకబారిన పేదోడి సున్నం బట్టి
ప్రజాశక్తి- శాంతిపురం
పెద్దపెద్ద పరిశ్రమల్లో తయారయ్యే కత్రిమ సున్నం మార్కెట్లో హల్చల్ చేస్తుంటే.. సున్నం బట్టిలను నమ్ముకున్న పేదోడి బతుకులు మాత్రం మసకబారి పోతున్నాయి. సహజ సిద్ధంగా భూగర్భం నుంచి లభించే ముడి సున్నపు రాళ్లను బట్టీల్లో కాల్చి తయారు చేసే సున్నంకు గ్రామీణప్రాంతాల్లో మంచి ఆదరణ ఉండేది. పూర్వకాలంలో సున్నపు రాళ్లతో తయారైన తయారుచేసే గారను పెద్దపెద్ద భవనాలు బంగ్లాలకు కాంక్రీట్‌గా ఉపయోగించేవారు. పూర్వకాలంలో సున్నపు గారితో నిర్మించిన భవనాలు నేటికీ చెక్కు చెదరలేదు. కాల్చిన సున్నాపురళ్లను నీళ్లలో వడబోసి గహాలకు వెల్ల వేసేవారు. భారతీయ సంస్కృతిలో శుభకార్యాల్లో వినియోగించే తాంబూలంలో సహజ సున్నానికి విశేషస్థానం ఉంది. కాలానుగుణంగా వచ్చిన మార్పులకు సహజసిద్ధమైన సున్నం కనుమరుగై వాడకంలోకి వచ్చింది.
మండల పరిధిలోని వెంకటేపల్లి గ్రామంలో సుమారు 10 కుటుంబాలు వంశపారంపర్యంగా సున్నపు బట్టీల మీద ఆధారపడి జీవిస్తున్నారు. సహజసిద్ధమైన సున్నం తయారు చేయడంలో కుప్పం ప్రాంతంలో వెంకటేపల్లికి ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో ముడి సున్నపురాళ్లపల్లె పాలారునది పరివాహక ప్రాంతంలో పుష్కలంగా లభించేవి. ఇప్పుడు ఆ నది ప్రాంతంలో లభించకపోవడంతో తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరు ప్రాంతం నుంచి ముడి సరుకును కొని తెచ్చుకుంటున్నారు. తెచ్చిన ముడి రాళ్ళను చిన్నచిన్న రాళ్లుగా పగులగొట్టి బొగ్గులు, చింతపొట్టు, కానుగ పొట్టును కలిపి బట్టిలలో కాలుస్తారు. కాల్చిన సున్నపురాళ్ళు, పొడులను వేరు చేసి వారపు సంతలో విక్రయిస్తారు. కోళ్లఫారాలు, పట్టుపురుగుల పెంపకంలో సున్నపు పొడిని విరివిగా ఉపయోగిస్తారు. కాల్చిన సున్నపురాళ్లను కత్రిమ సున్నాలను కొనుగోలు చేయలేని పేదవాళ్లు తమ ఇళ్ల గోడలకు రంగులు కలిపి వేస్తారు.
కత్రిమ సున్నం దెబ్బతో కుదేలు
మార్కెట్లో దొరికే కత్రిమ సున్నం దెబ్బతో వ్యాపారం పూర్తిగా కుదేలవుతోంది. సహజసిద్ధంగా సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసే సున్నం మంచి నాణ్యత కలిగి ఉండడమే కాకుండా మన్నికను ఇస్తుంది. రైతులు ప్రజలు గతంలో అధికంగా కొనుగోలు చేసేవారు. పండగలు పబ్బాలు వస్తేగాని సహజ సున్నం కొనేవారు లేరు. కత్రిమ సున్నం మార్కెట్లో ప్రవేశించడంతో అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి.
- ఉమాపతి, సున్నం తయారీదారుడు, వెంకటేపల్లి










