Feb 28,2023 21:35

ప్రజాశక్తి - భీమవరం
పట్టణంలోని ఏడో వార్డు గాంధీనగర్‌ ఎస్‌టి కాలనీలో మరుగుదొడ్ల సమస్యను పరిష్కరించాలని సిపిఎం పట్టణ నాయకులు ఎం.వైకుంఠరావు డిమాండ్‌ చేశారు. సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైకుంఠరావు మాట్లాడుతూ యానాది కాలనీలో వ్యక్తిగత మరుగుదొడ్లు లేక మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో మహిళలు బహిర్భూమికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ఇంతవరకూ మహిళలకు మరుగుదొడ్డి లేకపోవడం దారుణమన్నారు. అలాగే స్థానికంగా కుళాయిలు లేవని గతంలో స్పందనలో ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సాల్మన్‌రాజు, వీరాస్వామి, యోహాను, ఏసేపు, కుమారి, మరియమ్మ పాల్గొన్నారు.