'స్పందన'లో అర్జీ ఇచ్చినా పట్టని వైనం
ప్రజాశక్తి - వెదురుకుప్పం
జగనన్న గృహాలు ఎవరికిచ్చారో... జగనన్న కాలనీలు ఎవరికోసం నిర్మిస్తున్నారో... పూరిగుడిసెల్లో ఉండేవారి పేదల జీవితాల్లో మాత్రం ఏమాత్రం మార్పు రాలేదు.. వెదురుకుప్పం మండలం మొండివెంగనపల్లి పంచాయతీ నెమలగుంట గ్రామంలో మీనా, నాగరాజు దంపతులు నివసించడానికి కనీసం పూరిగుడిసె కూడా లేక మరుగుదొడ్డిలో కాపురం ఉంటున్న వైనం వెలుగులోకి వచ్చింది. 'స్పందన'లో ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆ దంపతులు 'ప్రజాశక్తి' వాపోయారు.
గంగాధరనెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం మొండివెంగనపల్లి పంచాయతీ నెమలిగుంట గ్రామంలో నివసిస్తున్న మీనా, నాగరాజు దంపతులకు సొంతిల్లు లేదు. నాగరాజు ప్రత్యేక ప్రతిభావంతుడు. చెవిటి, గుడ్డి, అవిటివాడు. వారి పెళ్లి జరిగి ఆరేళ్లయ్యింది. కూలి పనులు చేసి జీవనం గడుపుతున్నారు. ప్రస్తుతం మీనా గర్భవతి. అయితే ఇంతవరకూ వీరికి ఇల్లు మంజూరు కాలేదు. గతంలో కలెక్టర్ ఆఫీసులో 'స్పందన'కు వెళ్లి ఫిర్యాదుచేశారు. అర్జీ నంబర్ సిటిఆర్ 2022052969. బ్రాహ్మణపల్లి విఆర్‌ఒ ధనశేఖర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని వాపోయారు. ఎన్నాళ్లని మరుగుదొడ్డిలో కాపురం చేసేమని కన్నీళ్లపర్యంతమయ్యారు. తనకు న్యాయం చేయకపోతే సోమవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులతో నిరసన తెలుపుతామని చెప్పారు.
బాధితులకు న్యాయం చేస్తాం : సుధాకర్‌రావు, ఎంపిడిఒ, వెదురుకుప్పం
నాగరాజు కుటుంబ సమస్య మా దృష్టికి రాలేదు. సచివాలయ డిటిఒ ద్వారా విషయం తెలుసుకుని న్యాయం చేస్తాం. ఇంటి స్థలం సమస్య అయితే సచివాలయం ద్వారానే పరిష్కరిస్తాం. సోమవారం ఆ గ్రామానికి వెళ్లి విచారించి న్యాయం చేస్తాం.










