Jan 30,2022 12:47

చిత్రం : బంగార్రాజు
నటీనటులు : నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి, నాగబాబు, రావు రమేశ్‌, వెన్నెల కిశోర్‌, సంపత్‌ రాజ్‌, గోవింద్‌ పద్మసూర్య తదితరులు
నిర్మాణ సంస్థలు : అన్నపూర్ణ స్టూడియోస్‌ ప్రై.లి., జీ స్టూడియోస్‌
నిర్మాత : అక్కినేని నాగార్జున
దర్శకత్వం : కల్యాణ్‌ కృష్ణ కురసాల
సంగీతం : అనూప్‌ రూబెన్స్‌
సినిమాటోగ్రఫీ : జె. యువరాజ్‌
ఎడిటర్‌ : విజరు వర్థన్‌
విడుదల తేదీ : జనవరి 14, 2022


తెలుగులో సీక్వెల్స్‌ పెద్దగా హిట్టయిన సందర్భాలు చాలా అరుదు. ఆ మధ్య వచ్చిన 'బాహుబలి, దృశ్యం' వంటి కొన్ని చిత్రాలు మినహా.. సీక్వెల్స్‌ కథలకు ఒక భాగానికీ మరో భాగానికీ పెద్దగా పొంతన ఉండదు. అయితే కొనసాగింపు కథలు మాత్రం భారీగానే విజయం సాధించాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ అలా బాక్సాఫీస్‌ వద్ద ఈ సంక్రాంతికి హిట్టు కొట్టిన చిత్రమే అక్కినేని నాగార్జున నటించిన 'బంగార్రాజు'. 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి కొనసాగింపుగా సోషియో ఫ్యాంటసీ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా నాగ్‌ కెరీర్‌లోనే బిగ్‌ హిట్‌గా నిలిచింది. 'మనం' తర్వాత నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ఈ చిత్రం కూడా ఇదే కావడంతో ప్రత్యేకత సంతరించుకుంది. భారీ అంచనాల మధ్య సంక్రాంతి బరిలోకి దిగిన ఏకైక పెద్ద సినిమా 'బంగార్రాజు' ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించాడో చూద్దాం..

మరో సోషియో ఫ్యాంటసీ 'బంగార్రాజు'

కథలోకి వెళ్తే.. 'సోగ్గాడే చిన్ని నాయన' చిత్రం ఎక్కడ ముగిసిందో.. అక్కడి నుంచి 'బంగార్రాజు' కథ స్టార్ట్‌ అవుతుంది. ఆత్మగా వచ్చిన బంగార్రాజు (నాగార్జున) తన ఫ్యామిలీ సమస్యలన్నీ చక్కదిద్ది, తిరిగి వెళ్తాడు. కొన్నాళ్లకు డాక్టర్‌ రాము (నాగార్జున), సీత దంపతులకు కొడుకు పుట్టడం.. బాల్యంలోనే తల్లి చనిపోవడంతో.. అతని బాధ్యతలను నాన్నమ్మ సత్య అలియాస్‌ సత్తెమ్మ (రమ్యకృష్ణ) చూసుకుంటుంది. మనవడు పెద్దయ్యేసరికి సత్తెమ్మ కూడా చనిపోతుంది. చిన్న బంగార్రాజు (నాగచైతన్య) కూడా తాత మాదిరే ఊర్లో ఆవారాగా తిరుగుతూ అమ్మాయిల వెంటపడుతుంటాడు. మరోపక్క చిన్న బంగార్రాజు మరదలు నాగలక్ష్మీ (కృతిశెట్టి) ఆ ఊరికి సర్పంచ్‌ అవుతుంది. వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. కానీ వీరిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందని భావిస్తుంది సత్తెమ్మ. తన మనవడి ప్రేమకి సహాయం చేయడానికి బంగార్రాజుని పంపిస్తుంది. చిన్న బంగార్రాజు శరీరంలోకి పెద్ద బంగార్రాజు చేరి, సర్పంచ్‌ నాగలక్ష్మీని ప్రేమించేలా చేస్తాడు. మరోవైపు చిన్న బంగార్రాజు హత్య చేయడానికి కొంతమంది ప్లాన్‌ చేస్తారు. అసలు చిన్న బంగార్రాజుని ఎందుకు హత్య చేయాలనుకున్నారు? హత్యకు కుట్ర చేసిందెవరు? ఆపదలో ఉన్న మనవడిని బంగార్రాజు ఎలా కాపాడుకున్నాడు? ఊరి గుడి కింద ఉన్న నిధులపై కన్నేసిన దుష్టశక్తుల పన్నాగాలను బంగార్రాజు ఎలా తిప్పికొట్టారు? అనేదే మిగతా కథ.

    గ్రామీణ నేపథ్యం, ఆకట్టుకునే తారాగణం, కలర్‌ఫుల్‌ పాటలకి తోడు అభిమానుల్ని మెప్పించే అంశాల్ని జోడించి, సినిమాని తీర్చిదిద్దారు. 'సోగ్గాడే చిన్నినాయనా' కథకి కొనసాగింపుగా వచ్చిన చిత్రం కాబట్టి తొలి సినిమా తరహాలోనే పక్కా ఫార్ములాతో గుడికీ, బంగార్రాజు కుటుంబానికీ ముడిపెట్టి కథని అల్లుకున్నారు దర్శకుడు. తొలి సినిమాలో తనయుడి సమస్యయితే, ఇందులో మనవడి జీవితాన్ని చక్కబెడతాడు. తొలి సినిమాలో బంగార్రాజు మాత్రమే ఆత్మ, ఇందులో మాత్రం ఆయనకి సత్యభామ కూడా తోడైంది. ప్రథమార్ధం అంతా మన్మథుడుగా ముద్రపడిన చిన్న బంగార్రాజు, ఊరి సర్పంచ్‌ అయిన నాగలక్ష్మి హంగామాతోనే సాగుతుంది. ఒకరంటే ఒకరికి పడని ఆ ఇద్దరూ కలిసే వైనం, పెద్ద బంగార్రాజు చేసే మ్యాజిక్‌తో సన్నివేశాలు సరదాగా సాగిపోతాయి. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం ఆసక్తిని పెంచుతుంది. చాలా సన్నివేశాలు ఊహాజనితంగానే సాగినప్పటికీ మాస్‌ ప్రేక్షకుల్ని మెప్పించే అంశాల్ని పుష్కలంగా జోడించారు. అత్తమామలు, కోడలికి మధ్య మనస్పర్థల్ని తొలిగించే ఓ సన్నివేశంలో బంగార్రాజు చెప్పే సంభాషణలు, ఆ నేపథ్యంలో పండే భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ఆత్మల కథల్లోనూ.. కమర్షియల్‌ కథల్లోనూ లాజిక్‌లు వెతక్కూడదు. కానీ, ఇందులో కొన్ని విషయాలు మరీ నాటకీయంగా అనిపించాయి. కొన్ని సన్నివేశాలు లాజిక్‌కి ఏమాత్రం అందవు.
     ఈ సినిమాకు ప్రధాన బలం నాగార్జున, నాగచైతన్య నటనే. చిన్న బంగార్రాజు, పెద్ద బంగార్రాజు పాత్రల్లో వీరిద్దరూ ఒదిగిపోయారు. సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తాయి. బంగార్రాజు ఆత్మ చేరిన ప్రతిసారి నాగచైతన్య చేసే సందడి ఆకట్టుకుంటుంది. సర్పంచ్‌ నాగలక్ష్మీగా కృతిశెట్టి తనదైన నటనతో మెప్పించింది. రమ్యకృష్ణ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించింది. సంపత్‌ రాజ్‌, రావు రమేశ్‌, వెన్నెల కిశోర్‌, బ్రహ్మాజీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
    ఇక సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికొస్తే.. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం సినిమాకి ప్లస్‌. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా చక్కగా అందించాడు. యువరాజ్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. విజరువర్థన్‌ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.