Aug 05,2022 22:15

సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అజరు కుమార్‌

ప్రజాశక్తి - నగరి
మరమగ్గ కార్మికులు దాదాపు పది రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేసి సాధించుకున్నటువంటి కూలీరెట్ల పెంపును వెంటనే అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అజరు కుమార్‌ డిమాండ్‌ చేశారు. నగరి పట్టణంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో సిఐటియు శాఖ కమిటీల సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి.చైతన్య సమక్షంలో జరిగినది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అజరు కుమార్‌ మాట్లాడుతూ దాదాపు పది సంవత్సరాలపాటు మరమగ్గం కార్మికులకు ఒకే విధమైన కూలీరేట్లను ఇస్తున్నందు వలన పెరిగిన నిత్యవసర సరుకులు, కూరగాయలు, పెట్రోల్‌, డీజిల్‌ రేట్లకి అనుగుణంగా తమ కూలీ రేట్లను పెంచాలని కోరుతూ శిబిరం ఏర్పాటు చేసుకుని దాదాపు పది రోజులపాటు రిలే నిరాహార దీక్షలు, హైవే బంద్‌, జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం, లేబర్‌ అధికారులు, ఆర్డీవోలకు సామూహిక వినతి పత్రాల సమర్పణ ఇలా రకరకాల పోరాటాల తరువాత మాస్టర్‌ వీవర్లతో చర్చలు జరిపి రెండు రూపాయల యాభై పైసలు కూలి రేట్లు పెంచారని, పెంచిన కూలీ రేట్లు ఆగస్టు 1వ తేదీ నుండి అమలు కావాల్సి ఉన్నా ఇంకా ఏ ఒక్క మాస్టర్‌ వివర్లు కూడా పెంచిన కూలీ రేట్లు ఇవ్వలేదని, కాబట్టి పెంచిన కూలీ రేట్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.
జిల్లా కార్యదర్శి.చైతన్య మాట్లాడుతూ కూలి రేట్లకై మరమగ్గ కార్మికులు పోరాటాలు చేస్తున్న వేళ మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఈడి చార్జీల పేరిట విద్యుత్‌ చార్జీలను పెంచేసి, మరమగ్గ కార్మికుల నుండి ముక్కు పిండి వసూలు చేస్తున్న తీరు, విద్యుత్‌ చార్జీలు చెల్లించని మరమగ్గ కార్మికుల యొక్క విద్యుత్‌ కనెక్షన్లను తొలగిస్తున్న తీరు చాలా బాధాకరమని, తమ యుటిఎఫ్‌ ఎమ్మెల్సీలు మరమగ్గ కార్మికులకు పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని ముఖ్యమంత్రి కి విన్నవించబోతున్నారని, రాష్ట్రస్థాయి అధికారుల నుండి ఆదేశాలు వచ్చేంతవరకు స్థానికంగా ఉన్నటువంటి విద్యుత్‌ అధికారులు ఎవరు కూడా విద్యుత్‌ కనెక్షన్లను తొలగించి మరమగ్గ కార్మికుల కడుపుకొట్టోద్దని తెలిపారు. ఈకార్యక్రమంలో నగరి నియోజకవర్గ సిఐటియు కార్యదర్శి వెంకటేష్‌, మరమగ్గ కార్మికుల సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు పెరుమాళ్‌, నాయకులు షణ్ముగం, జగదీష్‌, గణపతి, రన్‌, కాలతి, అయ్యప్ప, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.