Oct 15,2022 21:41

మరింత పక్కాగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు
రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రత్యేక దృష్టి సారించండి : కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లాకలెక్టర్‌ యం.హరి నారాయణన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన రోడ్డు భద్రతపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 34 బ్లాక్‌ స్పాట్స్‌గా గుర్తించడం జరిగిందని, ఈ ప్రాంతాలతో పాటు ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలలో కూడా ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు అందుకు అవసరమైన ఏర్పాట్లపై రవాణా, పోలీస్‌శాఖతోపాటు రోడ్ల మరమ్మతులకు సంబంధించి పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బి, నేషనల్‌ హైవేస్‌ అధికారులతో కూడా సమన్వయం చేసుకోవాలన్నారు. నేషనల్‌ హైవే రోడ్లలో వివిధ ప్రాంతాలను సూచించే విధంగా సూచిక బోర్డులను ప్రధాన కూడలితోపాటు అవసరమైనచోట, మలుపులున్నచోట కూడా ఏర్పాటు చేయాలని తద్వారా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా ఉంటుందన్నారు. అలాగే కలెక్టరేట్‌ జంక్షన్‌, యాదమర్రి జంక్షన్‌, కుక్కలపల్లి జంక్షన్‌లతోపాటు జిల్లాలో సమసాత్మకంగా ఉన్న ప్రాంతాలలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై పాఠశాలలు, కళాశాలలో తరచుగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, దీనితో పాటు స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో సురక్షితమైన ప్రయాణం కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలపై టాక్సీ, బస్సు, లారీ అసోసియేషన్‌లతో కలిసి డ్రైవర్లకు అవగాహన పెంచాలన్నారు. పోలీస్‌శాఖ వారు నిర్వహిస్తున్న డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలను మరింత పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అడిషనల్‌ ఎస్పీ డాక్టర్‌ శ్రీనివాసరావు మాట్లా డుతూ డ్రైవింగ్‌ లైసెన్స్‌ మంజూరు చేసే సమయంలో వారికి డ్రైవింగ్‌కి సంబంధించిన అన్ని మెళుకువలు పూర్తిగా తెలియజేయాలని సరైన శిక్షణ అందించిన అనంతరం లైసెన్స్‌ మంజూరు చేయడం ద్వారా ప్రమాదాలను కొంతమేర నియంత్రించవచ్చునని సూచించారు. సమావేశంలో జిల్లా రవాణాశాఖ అధికారి బసిరెడ్డి, ఎన్‌హెచ్‌ఎఐ పిడి హరికష్ణ, పంచాయ తీరాజ్‌, ఆర్‌ అండ్‌ బి ఎస్‌ఈలు చంద్ర శేఖర్‌రెడ్డి, దేవానందం, ఆర్‌ఎం ఆర్టీసి జితేంద్రనాథ్‌ రెడ్డి, జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి, ఎన్‌హెచ్‌, చిత్తూరు ఈఈ అబ్దుల్‌ సలీం, ట్రాఫిక్‌ డిఎస్పి తిప్పేస్వామి పాల్గొన్నారు.