మరింత మెరుగ్గా పారిశుద్ధ్య పనులు : కమిషనర్
కమర్షియల్ దుకాణాల్లో చెత్త డబ్బాలు వినియోగించాలి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
నగరంలో పారిశుధ్య పనులను మరింత మెరుగ్గా చేపట్టాలని, ప్రధానంగా కమర్షియల్ దుకాణదారులు రోడ్లపై వ్యర్ధాలను పడేయకుండా చెత్త డబ్బాలు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ డాక్టర్ జె.అరుణ నగరపాలక ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. కమిషనర్ మంగళవారం ఉదయం 37, 26వ వార్డు పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ తీరును ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాత బస్టాండ్‌లో పారిశుధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని, నిషేధిత ప్లాస్టిక్ వినియోగించకుండా అవగాహన కల్పించడంతో పాటు, క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టాలని ఎంహెచ్వోను ఆదేశించారు. వ్యాపారస్తులు, దుకాణదారులు వ్యర్ధాలను డబ్బాల్లో వేసి నగరపాలక సంస్థ వాహనాలకు ఇచ్చేలా అవగాహన పెంచాలన్నారు. రెడ్ స్పాట్లను గ్రీన్ స్పాట్లగా మార్చాలని ఆదేశించారు. యూరినల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం కమిషనర్ 26వ వార్డుపరిధిలో పర్యటించారు. మురుగునీటి కాలువల్లో క్రమం తప్పకుండా పూడిక తొలగించాలని, వ్యర్ధాలను ఎప్పటికప్పుడు అక్కడ నుండి తీసివేయాలన్నారు. కొబ్బరి బొండాలను ఎక్కడపడితే అక్కడ పడేయడం ద్వారా దోమలకు ఆవాసంగా మారి విష జ్వరాలు ప్రబలుతాయని ఈ విషయంపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజలు నివాసాల వద్ద నిల్వ నీరు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంహెచ్వో డాక్టర్ లోకేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్య, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.
అందంగా డివైడర్ల నిర్వహణ...
డివైడర్లపై మొక్కల పెంపకాన్ని పక్కాగా చేపట్టాలని నగర కమిషనర్ అరుణ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కమిషనర్ పుత్తూరు రోడ్డులోని డివైడర్లపై మొక్కల పెంపకాన్ని తనిఖీ చేశారు. ఖాళీగా ఉన్న ప్రదేశాల్లోనూ మొక్కలు నాటాలని, ట్రిమ్మర్ల సాయంతో ఎప్పటికప్పుడు మొక్కలను అందంగా కత్తిరించాలన్నారు. పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించడం, క్రమం తప్పకుండా నీరు పట్టాలన్నారు. కార్యక్రమంలో డీఈ వెంకట ప్రసాద్, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.










