May 08,2023 00:14

మాట్లాడుతున్న డాక్టర్‌ పాపినేని శివశంకర్‌

ప్రజాశక్తి - తుళ్లూరు:పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం ఇచ్చి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దడంతోపాటు రెండు దశాబ్దాలకు పైగా సాహిత్య కార్యక్రమాల ద్వారా విలువలతో కూడిన సమాజం కోసం కృషి చేస్తున్న 'మువ్వా చిన బాపిరెడ్డి మెమోరియల్‌ ట్రస్టు' సేవలు అభినందనీయమని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్‌ పాపినేని శివశంకర్‌ పేర్కొన్నారు.ఆదివారం స్థానిక పెదపరిమి మువ్వా చిన్న బాపిరెడ్డి మెమోరియల్‌ ట్రస్టు భవనం వృద్ధాలయంలో 'సహస్ర కథా స్రవంతి' వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్‌ శివశంకర్‌ మాట్లాడుతూ వెయ్యి రోజులకు పైగా ప్రతి రోజు వేకువజామునే వాట్సప్‌ కథనం జనరంజకంగా సాహితీ పిపాసుల ఆకలి తీర్చే విధంగా ప్రసారం చేయటం అరుదైన సాహితీ సేవగా అభివర్ణించారు. ప్రముఖ నాటక రంగ రచయిత వల్లూరు శివప్రసాద్‌ మాట్లాడుతూ అంతర్జాలాల ద్వారా వికతాలు సమాజాన్ని ముంచెత్తుతున్న నేపథ్యంలో కథా స్రవంతులు సమాజానికి దారి చూపే దివిటీల వంటివన్నారు. సభకు అధ్యక్షత వహించిన ట్రస్టు చైర్మన్‌ ఎంవి రామిరెడ్డి మాట్లాడుతూ,'కథా స్రవంతి శ్రవణార్చన' ధారావాహికంగా పదివేలకు పైగా ప్రసారం చేసేందుకు సంకల్పించామని తెలిపారు. ఈ సందర్భంగా కథా స్రవంతి నిర్వాహకులు ములగాడ సురేష్‌ కుమార్‌,స్వర ప్రధా త పప్పు జోగారావు, సాంకేతిక సహకారం అందించిన పప్పు వరుణ్‌, దాసరి రవళిలను డాక్టర్‌ పాపినేని శివ శంకర్‌, ఎం.వి రామిరెడ్డి, చారిటబుల్‌ ట్రస్ట్‌ సభ్యులు ఘనంగా సత్కరించి జ్ఞాపకాలు అందజేశారు.హాజరైన ప్రతి ఒక్క కథా రచయితకు కథల పుస్తకాల సంచులను, జ్ఞాపికలను బహుకరించారు. కార్యక్రమంలో నరసింహారెడ్డి, వంగా సాంబిరెడ్డి,మువ్వా సాంబిరెడ్డి,ట్రస్టు సభ్యులు,గ్రామ పెద్దలు,పాల్గొన్నారు.