Jul 29,2023 22:24

నిలిచిపోయిన రైలు ఇంజిన్‌

           రాయదుర్గం : కదిరిదేవరపల్లి నుంచి రాయదుర్గం మీదుగా తిరుపతికి వెళ్లాల్సిన ప్యాసింజర్‌ రైలు(07589)ఇంజిన్‌ మొరాయించింది. శనివారం మధ్యాహ్నం ఈ రైలు కదిరి దేవరపల్లి వద్ద సాంకేతిక సమస్యలతో ఆగిపోయింది. దీనికి మరమ్మతులు చేసేందుకు రైల్వే ఇంజినీర్లు చాలా సేపు కష్టపడ్డారు. అయినా ఫలితం లేకపోయింది. రాయదుర్గం రైల్వేస్టేషన్‌కు సాయంత్రం 3.50 గంటలకు చేరుకోవాల్సిన రైలు సాయంత్రం 6 గంటలైనా చేరుకోకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. నిత్యం ఈ రైలు కోసం కదిరిదేవరపల్లి నుంచి తిరుపతికి వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఆయా స్టేషన్లలో వేచి ఉంచారు. తిరుపతికి వెళ్లేందుకు ఉన్న ఏకైక ప్యాసింజర్‌ రైలు కావడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు అందరూ కూడా ఇందులోనే రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి రైలు ఇంజిన్‌ మొరాయించడంతో ప్రయాణికులు అందరూ ఇబ్బంది పడ్డారు. ఇంజన్‌ ఎంత సరిచేసినా మరమ్మతు కాకపోవడంతో రైల్వే ఉన్నాతాధికారులు బళ్లారి నుంచి మరో రైలు ఇంజిన్‌ను కదిరిదేవరపల్లికి తెప్పించే ఏర్పాటు చేశారు. రాత్రి 9-00 గంటలకు బళ్లారి నుంచి ప్రత్యామ్నయ ఇంజిన్‌తో రైలు బయళ్దేరింది. దాదాపు 6 గంటలు ఆలస్యం కావడంతో ఈ రైలు ద్వారా ప్రయాణించాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.