ప్రజాశక్తి చిత్తూరుఅర్బన్:
మలేసియా, తైవాన్‌లకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 50కిపైగా కేసులున్న గిరినాయుడును పక్క ప్రణాళికతో పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఎర్రచందనం స్మగ్లర్లు శ్రీకాంత్, రామకృష్ణన్, పొన్నుస్వామి, చిన్నస్వామి, వెళ్ళయన్‌ను అదుపులోకి తీసుకొని నాలుగు టన్నుల ఎర్రచందనం దుంగలు, ఒక లారీ, టాటాసుమోను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై దృష్టి సారించిన పోలీసులు డిఐజి సెందిల్‌కుమార్ ఆదేశాల మేరకు ఎస్‌ఇబి విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షణలో పుత్తూరు డిఎస్‌పి యశ్వంత్, ములకలచెరువు సిఐ సాధిక్‌ఆలి, నగరి రూరల్ సిఐ రాజశేఖర్ రహస్య సమాచారం మేరకు శనివారం సత్యవేడు మండలం ఊత్తుకోట మెయిన్‌రోడ్ దాసుకుప్పం సచివాలయం వద్ద సత్యవేడు వైపు నుండీ ఊత్తుకోట వైపుగా వస్తున్న ఒక టటా సుమోను, లారీని తనిఖీ చేయగా లారిలో అక్రమంగా తరలిస్తున్న 4,035 కిలోల బరువుగల 145 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని 6 మంది వ్యక్తులను అరెస్టు చేసి విచారించగా ఇందులో మోస్ట్‌వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ గిరినాయుడు ఉన్నట్లు గుర్తించారు. తమిళనాడుకు చెందిన గిరినాయుడు కొందరు వ్యక్తులు గ్యాంగుగా ఏర్పడి ఎర్రచందనాన్ని అక్రమంగా చెన్నై పోర్టు నుండీ విదేశాలకు ఎగుమతి చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసులు విచారణలో నింధితులు వెళ్లడించారని పోలీసులు తెలిపారు.










