ప్రజాశక్తి-గుంతకల్లు డాక్టర్ బిఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రచార భేరి చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుండి పొట్టి శ్రీరాము కూడలి వద్ద వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఏపి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బి.గోవిందు, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి.గోవిందు, దాసరి శ్రీనివాసులు, సీపీఐ నియోజికవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి, సీపీఐ పట్టణ కార్యదర్శి గోపినాథ్, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి.శ్రీనివాసులు, దాసరి శ్రీనివాసులు మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసేందుకు ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి నుండి 30వ తేది వరకు ప్రచార భేరి కొనసాగుతుందన్నారు. మోడీని గెద్దెదించండి దేశాన్ని రక్షించండి అనే ప్రచార కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. బిజెపి ప్రభుత్వం గత 9 సంవత్సరాల నుండి ఒక పథకం ప్రకారం మత విద్వేషాలు రెచ్చగొట్టడం భారత రాజ్యాంగాన్ని, లౌకిక తత్వాన్ని విధ్వంసం చేయడం, కార్పొరేటర్ల దేశంగా మార్చడం చేస్తోందన్నారు. మోడీ చేస్తున్న దుర్మార్గాలను ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేయడం, నిర్భందిస్తోందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకపోగా ఉత్తరాంధ్ర జిల్లాలకు తల మానికంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మేస్తోందని అన్నారు. రాష్ట్రంలో ప్రధానమైన రాజకీయ పార్టీలు మోడీని ఒక్క మాట అనడానికి భయపడుతున్నాయని అన్నారు. మోడీ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం, సిపిఐ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కసాపురం రమేష్, మారుతీ ప్రసాద్, సాకే నాగరాజు, తిమ్మప్ప, సీపీఐ మండల కార్యదర్శి రాము, సహాయ కార్యదర్శి రామాంజినేయులు, ఎఐటియుసి వర్కింగ్ ప్రెసిడెంట్ తలారి సురేష్, కెవిపిఎస్ నాయకులు జగ్గలి రమేష్, పాల్గొన్నారు.
పెద్దవడుగూరు : కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక, నిరంకుశ విధానాలపై ఈ నెల 14 నుండి 30 వరకు సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ప్రచారభేరి నిర్వహించారు. స్థానిక గంగమ్మ ఆలయం సమీపంలో వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, సిపిఎం మండల కార్యదర్శి దస్తగిరి, సహాయ కార్యదర్శి మద్దిలేటి, క్రిష్ణనారాయణ, సిపిఐ జిల్లా నాయకులు ఎద్దుల సూర్యనారాయణరెడ్డి, సీనియర్ నాయకులు నారాయణ, సిపిఐ మండల కార్యదర్శి వెంకటరాముడు యాదవ్, నాయకులు రంగనాయకులు, మల్లికార్జున, అల్లాబకాష్ నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.










