ప్రజాశక్తి-పుట్లూరు కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపి దేశాన్ని కాపాడుకుందామని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని చింతకుంట, కందికాపుల గ్రామాల్లో గ్రామ శాఖల కార్యదర్శులు డి.పెద్దన్న, కుళ్లాయప్ప అధ్యక్షతన ప్రచార భేరి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజావ్యతిరేక, నిరంకుశ విధానాలను అవలంబిస్తోందన్నారు. అంతేగాకుండా దేశ ఉమ్మడి సంపదగా ఉన్న బ్యాంకుల్ని సైతం ప్రయివేటీకరణ చేసేందుకు పూనుకుందన్నారు. ఓడరేవుల్ని, అందరికీ అన్నం పెట్టే వ్యవసాయాన్ని సైతం కార్పొరేట్లకు ధారాదత్తం చేసేందుకు పూనుకుందన్నారు. మోడీ అండదండలతోనే అంబానీ, అదానీలు వేల కోట్లకు పడగలెత్తుతున్నారన్నారు. మరోవైపు గ్యాస్, పెట్రో, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. అరికట్టాల్సిన కేంద్రం చూస్తూ ఊరుకుందన్నారు. ఆయా విధానాలను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ఈనెల 30న నిర్వహించనున్న ఆందోళనలు ప్రజలు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు సి.పెద్దిరాజు, చేతివృత్తిదారుల సమైక్య మండల అధ్యక్షులు సి.ఓబుళపతి, సూరి, బాలన్న, రంగనాథ్, ఆంజనేయులు, డి.రామాంజనేయులు, పులి, ఆదెన్న, అనూష, చిట్టెమ్మ, పెద్దక్క, నాగ మునిమ్మ, తదితరులు పాల్గొన్నారు.
ప్రచారభేరిలో పాల్గొన్న వామపక్ష నాయకులు










