Mar 24,2023 21:50

బెలుగుప్పలో మాట్లాడుతున్న రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి

ప్రజాశక్తి-ఆత్మకూరు        కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలను పరిష్కరించాలని, మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఏప్రిల్‌ 5వ తేదీన చేపడుతున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి అందరూ తరలి వెళ్లి జయప్రదం చేద్దామని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.బాలరంగయ్య పిలుపునిచ్చారు. సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన జీపు జాతా శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు, కౌలురైతులు, ప్రజల సమస్యలను పరిష్కరించని దుస్థితి నెలకొందన్నారు. అత్యంత ధనవంతులైన ఆదానీ, అంబానీ వంటి వారి సేవలో మునిగి తేలుతూ దేశ రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు ఎదురు తిరగకుండా ఉండేందుకు మతం పేరుతో ప్రజలను విడగొట్టి పరిపాలిస్తున్నారని ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేకంగానూ, ప్రయివేట్‌ కార్పొరేట్‌ పెట్టు బడిదారులకు అనుకూలంగా ఉందన్నారు. మోడీ విధానాలను తూచా తప్పకుండా పాటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీరు చాలా బాధాకరమని అన్నారు. ఇటు వంటి ప్రజా వ్యతిరేక విధానాలకు బదులుగా ప్రజానుకూల విధానాల కోసం ఏఫ్రిల్‌ 5న ఢిల్లీలో జరిగే కార్మిక, కర్షక, పోరాట ప్రదర్శనలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శివశంకర, రామయ్య, రాజేశ్వరమ్మ, వెంకటమ్మ, సోమశేఖర్‌, సరస్వతి, వలీ తదితరులు పాల్గొన్నారు.
రాయదుర్గం : ఏప్రిల్‌ 5న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన జీపు జాతా శుక్రవారం రాయదుర్గం చేరుకుంది. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బంగి శివ అధ్యక్షతన జరిగిన జీపు జాతాలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, సిఐటియు రాష్ట్ర నాయకులు నాగభూషణం, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాల రంగయ్య మాట్లాడారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులు అమలు చేయాలని, రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, అన్ని పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, ఉపాధి కూలీలకు 200 రోజులు పనులు, రోజు వేతనం రూ.600 ఇవ్వాలని, ఎటువంటి షరతులు లేకుండా కౌలు రైతులందరికీ సిసిఆర్‌సి కార్డులు ఇచ్చి పంట రుణాలు, నష్టపరిహారం, పంటల బీమా సబ్సిడీ ఎరువులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌, అవుట్సోర్సింగ్‌, వాటర్‌ వర్క్స్‌ కార్మికులందరిని క్రమబద్ధం చేసి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. ఈ డిమాండ్ల సాధనకై ఏప్రిల్‌ 5వ తేదీన జరిగే చలో ఢిల్లీ కార్యక్రమానికి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్‌ నాయకుడు నాగరాజు, శంకర్‌, తిమ్మరాజు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు లోకేష్‌, వంశీ, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు, ప్రజానాట్యమండలి కళాకారులు పాల్గొన్నారు.
బెలుగుప్ప : రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన జీపు జాతా శుక్రవారం బెలుగుప్ప మండల కేంద్రానికి చేకుంది. నాయకులు మాట్లాడుతూ.. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం భూ నిర్వాసిత రైతులకు పరిహారం ఇవ్వాలని, అసైన్డ్‌ సీలింగ్‌ భూములను పేదలకు పంచిపెట్టాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి వడ్డీ లేని పంట రుణాలు, నష్టపరిహారం, బీమా పరిహారాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు నాగభూషణం, సిఐటియు మండల కార్యదర్శి భీమన్న, ప్రజానాట్యమండలి కార్యదర్శి శ్రీనివాసులు, హమాలీ యూనియన్‌ అధ్యక్షులు మారెన్న, పాతన్న, ఎర్రిస్వామి తదితరులు పాల్గొన్నారు.