Apr 25,2023 08:30

సమావేశంలో మాట్లాడుతున్న వి.రాంభూపాల్‌

             అనంతపురం కలెక్టరేట్‌ : ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ భారాలు మోపుతున్న ప్రధాని మోడీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అనంతపురం నగరంలో మంగళవారం నాడు బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ తెలిపారు. సోమవారం స్థానిక గణేనాయక్‌ భవన్‌లో సిపిఎం నగర కమిటీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు దేశ సంపదను దోచిపెడుతూ ప్రజలపై భారాలు మోపి నడ్డివిరుస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రయివేటీకరిస్తోందన్నారు. రాష్ట్ర విభజన అంశాలు ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. సెంట్రల్‌ యూనివర్శిటీ నిర్మాణంలో తీవ్ర జాప్యం చేస్తోందన్నారు. జిల్లాలో ఏర్పాటు చేస్తామన్న జాతీయ సంస్థలు నాసన్‌, బెల్‌, వంటి సంస్థలు ఏ ఒక్కటి ఏర్పాటు చేయలేదన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటీకరించేందుకు సిద్ధమైందన్నారు. గుంతకల్‌ రైల్వేజోన్‌ ఏర్పాటు చేయలేదన్నారు. మోదీ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అవుతున్నాయని తెలిపారు. అక్రమ పద్ధతిలో 11 రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ప్రతిపక్షాలు లేకుండా చేయడానికి కుట్ర చేస్తోందన్నారు. బిజెపియేతర రాష్ట్రాల్లో అధికారం చెలాయించేందుకు అనేక వక్ర మార్గాలు అనుసరిస్తూ స్వార్థపూరిత రాజకీయాలు చేస్తోందన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో చైతన్యం కల్పించడంలో భాగంగా ప్రచార పాదయాత్ర, సమావేశాలు, సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేడు సాయంత్రం 5 గంటలకు నగరంలో పాతూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం నిర్వహించే బహిరంగ సభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాబురావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర 1వ కమిటీ కార్యదర్శి వి.రామిరెడ్డి, నగర నాయకులు వెంకటనారాయణ, ముస్కిన్‌, వలీ, ప్రకాష్‌, మసూద్‌, జీవా, రాజు, వెంకటేష్‌, ప్రసాద్‌, వరలక్ష్మి, ఎర్రిస్వామి, బాలక్రిష్ణ, లక్ష్మినారాయణ, నూరుల్లా, ఎన్టీఆర్‌ శీనా తదితరులు పాల్గొన్నారు.