Sep 07,2023 21:34

సంఘీభావ యాత్ర నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

* డిసిసి అధ్యక్షులు బొడ్డేపల్లి సత్యవతి
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దేశంలో మతోన్మాదం, ప్రాంతాల మధ్య విద్వేషం, కులాల మధ్య చిచ్చు, దేశ సంపదను కార్పొరేట్‌ వ్యవస్థకు ధారాదత్తం చేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు బొడ్డేపల్లి సత్యవతి విమర్శించారు. కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడోయాత్ర ఏడాది పూర్తయిన సందర్భంగా సంఘీభావ యాత్రను నగరంలో గురువారం నిర్వహించారు. ఇందిరా విజ్ఞాన్‌ భవన్‌ నుంచి అరసవల్లి మిల్లు జంక్షన్‌ వరకు చేపట్టిన యాత్రను ఆమె ప్రారంభించారు. దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టాలని బిజెపి చూస్తోందని, ఆ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బిజెపి అనేక కుట్రలకు పాల్పడుతోందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు డి.గోవింద మల్లిబాబు, అంబటి కృష్ణారావు, పైడి నాగభూషణరావు, పేడాడ పరమేశ్వరరావు, బస్వా షణ్ముఖరావు, కొత్తకోట సింహాద్రి నాయుడు, కొత్తకోట లక్ష్మి, కె.వి.ఎల్‌.ఎస్‌ ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.