Apr 30,2023 21:47

సభలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బాల రంగయ్య

        ప్రజాశక్తి-ఉరవకొండ   దేశంలో మతోన్మాద, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వానికి వంతుపాడుతున్న జగన్‌ను గద్దె దింపడానికి వామపక్షాలతోపాటు ప్రజాతంత్ర, లౌకిక శక్తులన్నీ ఏకం కావాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బాల రంగయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి సి.జాఫర్‌ పిలుపునిచ్చారు. కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్షాలు చేపట్టిన ప్రచార భేరి కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉరవకొండలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక ఆర్టీసీ డిపో నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయలేకపోయిందన్నారు. సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని, ధరలు తగ్గిస్తామని, నల్లధనం వెనక్కి తీసుకొచ్చి, ఒక్కొక్కరి అకౌంట్లో రూ.15 లక్షలు జమ చేస్తామని చెప్పిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేకపోయిందన్నారు. అంతేగాకుండా పాతనోట్లను రద్దు చేసి దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని ఆరోపించారు. జీఎస్టీని తీసుకురావడం వల్ల దేశంలో అనేక పరిశ్రమలు మూతబడ్డాయన్నారు. ఫలితంగా నిరుద్యోగం పెరిగిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. దేశ అభివృద్ధిని విస్మరించిన మోడీ ప్రభుత్వం కులం, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి మరోసారి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. దేశంలో ఇప్పటికే దళితులు, ముస్లింలు ఆదివాసీలపై విపరీతంగా దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే పార్టీలు, గొంతులను అణిచివేయడానికి సిబిఐ, ఈడీల పేరుతో బెదిరింపులకు దిగుతోందని విమర్శించారు. ఇందులో భాగంగానే రాహుల్‌ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసి వైశాచిక ఆనందాన్ని పొందుతోందన్నారు. ఇకపోతే రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌ కూడా నియంత విధానాలను అవలంభిస్తున్నారన్నారు. ప్రజల కోసం పోరాటాలు చేసే వారిపై కేసులు నమోదు చేయడం, గృహనిర్బంధాలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. జీవో-1ని తీసుకొచ్చి ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నాడని విమర్శించారు. ముఖ్యంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టడంలో జగన్‌ విఫలమయ్యారన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువ ఆధునీకరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు లేకపోవడంతో అనేకమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశాన్ని విచ్చిన్నం చేస్తున్న మోడీని, జగన్‌ను గద్దె దించడానికి ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ సిపిఎం నాయకులు రంగారెడ్డి, సిపిఐ తాలూకా కార్యదర్శి మల్లికార్జున, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కేశవరెడ్డి, గిరిజన సమాఖ్య రాష్ట్ర నాయకులు రామాంజనేయులు, కార్మిక సంఘం జిల్లా నాయకులు మల్లికార్జున, సిపిఐ తాలూకా సహాయ కార్యదర్శి మనోహర్‌, సిపిఎం నాయకులు విరుపాక్షి, కృష్ణమూర్తి, సిపిఐ సీనియర్‌ నాయకులు శివన్న, పార్వతీప్రసాద్‌ పాల్గొన్నారు.