మోడీ హయాంలో రాజ్యాంగానికి ప్రమాదం
ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్
మోడీ హయాంలో రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందని, దళితులపై దాడులు పెరిగాయని కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి క్రాంతి కుమార్ పిలుపు నిచ్చారు. చిత్తూరు జిల్లా కెవిపిఎస్ మహాసభలు శుక్రవారం చిత్తూరులోని స్థానిక సిఐటియూ కార్యాలయము నందు అన్నూరు ఈశ్వర్ అధ్యక్షతన జరిగింది. ఈ మహా సభలకు ముఖ్య అతిథిగా హాజరైన క్రాంతి కుమార్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో దళితులు సమస్యలపై ఐక్యంగా ఉద్యమించాలని, పలు దళిత గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, మంచినీళ్లు, స్మశానాలు లేని గ్రామాలు అధికంగా ఉన్నాయని, వాటి కోసం కెవిపిసిఎస్ గతంలో అనేక పోరాటాలు చేసిందన్నారు. గత 22 సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా కె.వి.పి.ఎస్ ఆధ్వర్యంలో చేసిన పోరాటాల ఫలితంగా జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు అయిందని గుర్తు చేశారు. ఆ కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కొన్ని సమస్యలు పరిష్కారం చేసినప్పటికీ ప్రస్తుతం అనేక రకాల సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందని, అందులో భాగంగానే దళితులపై దాడులు పెరుగుతున్నాయని, హత్యలు, అత్యాచారాలు, కులవివక్ష సమస్యలపై, డప్పు కళాకారుల పెన్షన్ సమస్యల పరిష్క రాలకు మార్గదర్శకాలు, రూపకల్పన చేసేందుకు నవంబరు 28, 29 తేదీలలో కర్నూల్ నందు జరగనున్న కెవిపిఎస్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ మహాసభల్లో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి సురేంద్ర, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వాడ గంగరాజు, చైతన్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఓబుల్ రాజు, చిరంజీవమ్మ, డప్పు కళాకారుల సంఘం నాయకులు కన్నన్, లోకయ్య తదితరులు పాల్గొన్నారు.










