అనంతపురం కలెక్టరేట్ : గుంతకల్లు మండలం, మొలకలపెంట గ్రామంలో కిడ్నీ వ్యాధి తీవ్రంగా ఉందని, వెంటనే ప్రభుత్వం ఆ గ్రామానికి వైద్య నిపుణులను పంపి కారణాలను పరిశీలించి వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ డిమాండ్ చేశారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలను తెలుసుకునేందుకు సిపిఎం ప్రతినిధుల బృందం మొలకలపెంట గ్రామంలో మంగళవారం పర్యటించారు. బాధితులతో మాట్లాడి పలు విషయాలను తెలుసుకున్నారు. దీనిపై బుధవారం స్థానిక గణేనాయక్ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొలకలపెంట గ్రామంలో కిడ్నీ వ్యాధితో పలువురు బాధపడుతున్నారని చెప్పారు. ఈ గ్రామంలో ఇప్పటికే ఈ వ్యాధితో నాగార్జున, యల్లప్ప మరణించారని తెలిపారు. వారంలో మూడు రోజులు అనంతపురం కిమ్స్ సవీరా ఆసుపత్రిలో వీరు డయాలసీస్ చేయించుకుంటున్నారని తెలిపారు. అనంతపురం వెళ్లడానికి ఒక వ్యక్తికి వారానికి రూ.2500 వేలు ఖర్చు అవుతోందన్నారు. నెలకు రూ.11 వేల నుంచి రూ.16 వేలు మందులు రాసి ఇస్తున్నట్లు రోగుల కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. ప్రకాష్ అనే వ్యక్తి గత ఎనిమిది నెలలుగా డయాలసిస్ చేయించుకోవడం వల్ల ఆయనకు ఉన్న ఎకరం పొలం అమ్మేసినట్లు బృందానికి తెలిపారు. ఆయనకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారన్నారు. ఈ తమ్ముడు నాగార్జున ఐదు నెలల క్రితం కిడ్నీ సమస్యతో మరణించాడని తెలిపారు. గ్రామంలో అనేక మందిలో వ్యాధి లక్షణాలు ఉన్నప్పటికీ పరీక్షలు చేయించుకోవడానికి భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. జిల్లా అధికారులు స్పందించి మొలకలపెంట గ్రామానికి వైద్య నిపుణుల బృందాన్ని పంపి వ్యాధి కారణాలను గుర్తించాలన్నారు. డయాలసీస్ రోగులను అనంతపురం తీసుకురావడంతో పాటు, వారిని మళ్లీ గ్రామానికి చేర్చే విధంగా రవాణా ఏర్పాట్లు చేయాలన్నారు. వారి పిల్లల చదువులు మధ్యంతరంగా ఆగిపోకుండా అమ్మాయిలను కస్తూరిబా, అబ్బాయిలను గవర్నమెంట్ హాస్టల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు అందరికీ డయాలసిస్‌తో సంబంధం లేకుండా పింఛన్ ఇవ్వాలని కోరారు.










