May 15,2023 22:51

పరీక్షల నిర్వహణపై అధికారులతో మాట్లాడుతున్న జెఎన్‌టియు విసి
ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం జేఎన్టీయూ, ఆంధ్ర ప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈఏపీసెట్‌-23 సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం,సాయంత్రం రెండు పూటలు జరిగిన ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి 50, 235 మంది హాజరు కావల్సి ఉండగా 3231 మంది గైర్హాజరైనల్లు ఈఏపీసెట్‌-23 చైర్మెన్‌ ఆచార్య జి. రంగ జనార్ధన, కన్వీనర్‌ ఆచార్య సి. శోభాబిందు తెలిపారు. సోమవారం ఉదయం మరియు మధ్యాహ్నం జరిగిన పరీక్షలలో ఆంధ్రప్రదేశ్‌ లో మొత్తం 48,913 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా 46,380 మంది హాజరయ్యారని చెప్పారు. అలాగే తెలంగాణలో 4,322 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా 3,624 మంది హాజరయ్యారని చెప్పారు. ఈ పరీక్షలకు 93.93 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని ఈఏపీసెట్‌ -23 చైర్మెన్‌ ఆచార్య జి. రంగ జనార్ధన తెలిపారు. పరీక్ష కేంద్రాల తనిఖీ : సోమవారం ప్రారంభమైన ఈఏపీసెట్‌ -23 పరీక్షల కేంద్రాలను జేఎన్టీయూ ఉపకులపతి, ఈఏపీసెట్‌ చైర్మెన్‌ ఆచార్య జి.రంగ జనార్ధన పరిశీలించారు. అనంతపురం లోని అనంతలక్ష్మీ ఇంజినీరింగ్‌ కళాశాలను, కడప జిల్లాలోని కె.ఎస్‌.ఆర్‌.ఎం ఇంజనీరింగ్‌, కోరం ఇంజినీరింగ్‌ కళాశాలను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కళాశాల అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పరీక్షలు నిర్వహణలో నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.