Jul 06,2022 00:05

జరావారిపల్లి గ్రామంలో స్కూల్‌ ఎదుట నిరసన తెలుపుతున్న విద్యార్థులు, గ్రామస్తులు

విలీనం వద్దంటూ తల్లిదండ్రుల ఆందోళన
గేటు ఎదుట గ్రామస్తుల నిరసన
ఉపాధ్యాయులను బయటే ఉంచిన వైనం..
ప్రజాశక్తి- గంగవరం

మండలం కీలపట్ల పంచాయతీ బండమీద జరావారిపల్లి గ్రామస్తులు తమ గ్రామంలోని పాఠశాలను ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యా విధానంలో భాగంగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కీలపట్ల ఉన్నత పాఠశాలకు బదిలీ చేయవద్దంటూ నిరసన తెలిపారు. మంగళవారం పాఠశాల గేటుకు తాళం వేసి ఉపాధ్యాయులను సైతం లోనికి వెళ్లనీకుండా అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితులలోనూ తమ పిల్లలను వేరే ఊరికి పంపమని హెచ్చరించారు. పాఠశాల తెరిచిన మొదటి రోజే ఉపాధ్యాయులను పాఠశాల లోనికి వెళ్ళనివ్వకుండా గేటుకు తాళం వేసి గేటు ముందు కూర్చుని నినాదాలు చేసి బడి నిలిపివేయడంతో ఉపాధ్యాయులు ఏమీ చేయలేని పరిస్థితిలో పాఠశాల గేటు ముందే కూర్చోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈసందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలోని పాఠశాలకు నాడు-నేడు పథకంలో భాగంగా రూ.30లక్షల నిధులు మంజూరు చేసి పక్కా భవనాలు మౌలిక వసతులు, ప్రహరీగోడ, నూతన పథకంలో నిర్మిచారని ఎంతో ఆశతో తమ పిల్లలను ప్రైవేటుపాఠశాలల్లో చేర్చకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించామని, ఇలాంటి పరిస్థితులలో వేరే ఊరికి ఎలా పంపగలమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాఠశాలలో 176మంది విద్యార్థులకు సరపడా ఉపాధ్యాయులు ఉన్నప్పుడు ఎందుకు పాఠశాలను విలీనం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతు భూలక్ష్మమ్మ మాట్లాడుతూ ఇక్కడ అటవీ ప్రాంతం ఎక్కువగా ఉందని, తాను పొలం వద్ద పశువులను మేపి సాయంత్రం ఐదు గంటలకు కొట్టంలో కట్టి ఇళ్లు చేరుకునే సమయానికి ఓ చిరుత దూడపై దాడి చేసిందని తెలిపారు. వెంటనే ఈ సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశామని, ఆరోజు వర్షం పడటంతో చిరుత తిరిగిన ఆనవాలును ఫారెస్టు వారు గుర్తించలేకపోయారని తెలిపారు. రైతు అశోక్‌ మాట్లాడుతూ ఈప్రాంతంలో గత పది సంవత్సరాలుగా ఏనుగులు గుంపులు గుంపులుగా అనేకసార్లు తమ పంటలపై పడి ధ్వంసం చేయడంతోపాటు కొన్నిసార్లు గ్రామంలోనూ సంచరిస్తుంటాయని తెలిపారు. ఇటువంటి అటవీ ప్రాంతంలో మూడు కిలోమీటర్లు పిల్లలు నడకదారిణ వెళ్లివస్తూ ఉంటే ఎక్కడ ఏ అడవి జంతువు భారిన పడతారో, తిరిగి వస్తారో లేదన్న భయాందోళనతో నిరీక్షించాల్సిన దుస్థితి ఉంటుందన్నారు. తమ బిడ్డలను అడవి జంతువులకు బలి ఇవ్వదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కీళ్లపట్ల పాఠశాల అందరు విద్యార్థులకు గదులు సరిపోదని, ఉపాధ్యాయులు చాలరని తమ బిడ్డల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విలీనాన్ని అపి యథావిధిగా జరావారిపల్లిలో పాఠశాల కొనసాగించాలని కోరారు.
కార్వేటినగరం : మండలంలో ఎన్‌ఆర్‌ కండ్రిగ, పాదిరికుప్పం పాఠశాలను జెడ్‌పి ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం వల్ల విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులను కోరారు. తమ పిల్లలను ఎన్‌ఆర్‌కండిగా పాఠశాలల్లో చదివేటట్లు చూడాలని వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా కార్వేటినగరం బీసీకాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 3,4,5 తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.