May 15,2023 16:39
  • ఉపాధి హామీ అవినీతిపై ఆధారాలతో ప్రజా ప్రతినిధులు హాజరు అయ్యేరా??

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో దివాకర్ తెలిపారు. ఈ సమావేశానికి మండలంలోని జడ్పిటిసి సభ్యులు అందరు ఎంపీటీసీలు సభ్యులు సర్పంచులు కోఆప్షన్ మెంబర్లు  మండలంలోని అన్ని శాఖల అధికారులు సమావేశానికి హాజరుకావాలని అధికారులు వారి వారి శాఖలకు సంబంధించిన పూర్తి నివేదికలతో సమావేశానికి రావాలని ముందస్తు సమాచారం లేకుండా సమావేశానికి గైర్హాజరైతే సంబంధిత అధికారులపై తగు చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో మండలంలోని అన్ని సమస్యలను చర్చించడం జరుగుతుందని తెలిపారు. ఉపాధి హామీ అవినీతిపై సర్వసభ్య సమావేశంలో సభ్యులు బట్టబయలు చేసేరా.. గత సర్వసభ్య సమావేశంలో ఉపాధి హామీ పనుల్లో తీవ్రమైన అవినీతి జరుగుతోందని ఉపాధి పనులకు వెళ్ళని వారు బిల్లులు పొందుతున్నారని అటువంటి వారిపైన తగు చర్యలు తీసుకోవాలని అంతేకాకుండా సొంత గ్రామంలో లేకుండా ఇతర గ్రామాల్లో ఉన్నవారు సైతం రాజకీయ పలుకుబడులతో బిల్లులు పొందుతున్నారని కొందరు బిల్లు బిల్లుకు ఇంత కమిషన్ తీసుకుంటూ ఇష్టారాజ్యంగా ఉపాధి హామీ పనుల్లో అవినీతి చేస్తున్నారని పలువురు ఎంపీటీసీ సభ్యులు ఆరోపించారు. ఆధారాలతో సహా నిరూపిస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు దొంగ బిల్లులు పొందిన వారి నుండి చట్టపరమైన చర్యలు తీసుకొని ఇటువంటి వారిపై కేసులు నమోదు చేసి డబ్బులను రికవరీ చేస్తామని ఎంపీడీవో దివాకర్ తెలిపారు. దీంతో నేడు జరగబోయే సమావేశానికి ఎంపీటీసీలు వారి వారి గ్రామల పరిధిలో జరిగే ఉపాధి హామీ పనుల అవినీతి చిట్టాలను తీసుకొని వచ్చి సర్వసభ్య సమావేశం లోనే బట్టబయలు చేస్తారని మండల వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ మండల సర్వసభ్య సమావేశానికి ఎటువంటి నివేదికలతో గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు హాజరవుతారోనని మొత్తానికి మండల ఉపాధి హామీలో పనులలో జరిగే అవినీతికి అడ్డుకట్ట వేస్తారో లేదో వేచి చూడాల్సిందేనని అంటున్నారు.