
* వైసిపి ప్రచార విభాగం జోనల్ ఇన్‌ఛార్జి చింతాడ రవికుమార్
ప్రజాశక్తి - ఆమదాలవలస: టిడిపి, జనసేన పార్టీలు వాటి మనుగడ కోసమే పొత్తు ప్రకటించుకున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం జోనల్ ఇన్‌ఛార్జి చింతాడ రవికుమార్ విమర్శించారు. ప్రజా సంక్షేమం గురించి ఆ పార్టీలకు నిబద్ధత, భావసారూప్యత లేదన్నారు. పట్టణంలోని బొడ్డేపల్లిపేటలో గల జగనన్న ప్రజా సేవ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టిడిపి, జనసేన పార్టీలు కనుమరుగు కాక తప్పదన్నారు. ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే ఓట్లు పడతాయి గానీ పొత్తుల వల్ల ఓట్లు పడవన్నారు. టిడిపి, జనసేన పొత్తుతో జనసేన కార్యకర్తలు, అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన సైనికుల మనోభావాలకు వ్యతిరేకంగా తన స్వార్థం కోసం చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ జన సైనికుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. అవినీతిపై పోరాడతానని ప్రగల్భాలు పలికిన పవన్ కళ్యాణ్, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో నిందితునిగా జైల్లో ఉన్న చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్‌లో నిలకడలేనితనానికి, స్వార్థ రాజకీయాలకు ఇదే నిదర్శనమన్నారు. వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని, అవినీతికి పాల్పడిన చంద్రబాబు శాశ్వతంగా జైల్లోనే ఉంటారని, అవినీతికి పాల్పడిన మిగతా టిడిపి నాయకులూ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు కె.ఈశ్వరరావు, కెప్టెన్ రామారావు, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.