అనంతపురం కలెక్టరేట్ : మణిపూర్ హింస, మారణహోమాన్ని నిర్మూలించి శాంతి నెలకొల్పడంలో భాగంగా అక్కడున్న బిజెపి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని యునైటెడ్ జేఏసీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మణిపూర్‌లో జరిగిన మారణహోమాన్ని వ్యతిరేకిస్తూ యునైటెడ్ జేఏసీ ఆధ్వర్యంలో అనంతపురం ఆదివారం నాడు శాంతి ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం నుంచి టవర్‌క్లాక్ సర్కిల్ వరకు శాంతి ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, సిపిఐ రాష్ట్ర నాయకులు డి.జగదీస్, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక అబ్దుల్ రసూల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాదాగాంధీ, సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, మానవ హక్కుల వేదిక చంద్రశేఖర్, యునైటెడ్ జేఏసీ నాయకులు ముస్కిన్, బంగారు బాషా, ఏజీ.రాజమోహన్, వలి, ఐఎంఎం బాషా, సాకే హరి, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ మణిపూర్‌లో జరిగిన సంఘటన అమానవీయమైనదన్నారు. దేశ చరిత్రలో మునుపెన్నడూ జరగనంతగా మారణహోమం జరిగిందన్నారు. మణిపూర్ ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించి గిరిజనుల ప్రాణాలు కోల్పోవడానికి కారణం అయిందన్నారు. మతం చాటున జాతులను నిర్మూలించాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాన్ని ఎక్కడిక్కడ అడ్డుకోకపోతే రానున్న కాలంలో మారణహోమం దేశంలోని అన్ని ప్రాంతాల్లో చూడాల్సి వస్తుందన్నారు. దురదృష్టం కొద్ది రాష్ట్ర రాజకీయాలు నడుపుతూ ఒకరిపై ఒకరూ భీకరంగా మాట్లాడుకుంటున్న టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి, జనసేన పార్టీ నేతలు అవిస్వాస తీర్మాణానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకోవడం సిగ్గు చేటు అన్నారు. సిపిఐ రాష్ట్ర నాయకులు జగదీష్ మాట్లాడుతూ మణిపూర్‌లో శాంతి నెలకొల్పాలని బాధిత ప్రజలను అన్ని విధాలుగా సహాయ సహకారాలు, నష్టపరిహారం ఇచ్చి జీవనస్థితిగతులు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ప్రజాతంత్ర వాదులుగా ఇలాంటి సంఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ నాగరాజు, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు జిలాన్, ఆవాజ్ జిల్లా అధ్యక్షులు వలి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు శంకర్ తదితరులు పాల్గొన్నారు.










