ప్రజాశక్తి-గుంతకల్లు మణిపూర్‌లో మహిళల ను వివస్త్రలను చేసి ఊరేగించడంతో పాటు అత్యాచారం చేసిన కామాంధు లను ఉరితీయాలని ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా ఆధ్వర్యంలో విద్యార్థినులతో కలిసి శుక్రవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర నాయకురాలు సావిత్రి, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు సి.రమేష్ మాట్లాడుతూ మణిపూర్‌లో రెండు నెలల నుంచి మహిళల పట్ల హింసలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. మే 5న అక్కడ కొంతమంది యువకులు ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి వీధుల వెంబడి నడిపించి అత్యాచారం చేసినా కేంద్రం స్పందించకపోవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఘటనకు బాధ్యులైన కామాంధులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మణిపాల్‌లో శాంతిని నెలకొల్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి వెంకీ, ఐద్వా పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు జ్యోతి, రంగమ్మ, లక్ష్మీబాయి, విద్యార్థినులు లక్ష్మి, షమీనా, రుక్మిణి, పద్మజ, తదితరులు పాల్గొన్నారు.
ర్యాలీ నిర్వహిస్తున్న ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థినులు










