ప్రజాశక్తి - యలమంచిలి
మణిపూర్‌లో మహిళలపై ఇటీవల జరిగిన దారుణాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం చించినాడ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కానేటి బాలరాజు మాట్లాడుతూ మణిపూర్‌లో మహిళలపై సభ్య సమాజం తలదించుకునే విధంగా దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా అక్కడి ప్రభుత్వానికి గాని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి గాని చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. ఇటువంటి దారుణాలను ప్రజాతంత్ర వాదులంతా ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు సరిపల్లి జయప్రభ, కానేటి ప్రియాంక, ముస్కుడి జయశ్రీ, గొల్ల విజరుకుమారి, సిపిఎం జిల్లా నాయకులు బాతిరెడ్డి జార్జి, ప్రముఖ వైద్యులు మదన్ గోపాల్ పాల్గొన్నారు.
పాలకొల్లు : మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా పాలకొల్లు ఐద్వా ఆధ్వర్యంలో టిడ్కో గృహాల వద్ద ఆదివారం మహిళలు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా ఈ సంఘటన ఉందని ఐద్వా పట్టణ అధ్యక్షురాలు బాసిన శ్యామల విమర్శించారు. దేశంలో ఇంకా తాలిబాన్ పరిస్థితి ఉండటం సిగ్గు చేటని ఆమె పేర్కొన్నారు.
తణుకు రూరల్:మణిపూర్‌లో మతోన్మాదుల నుంచి ప్రజాస్వామ్యాన్ని, ప్రజలు, మహిళల ప్రాణాలు, హక్కులు కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి.ప్రతాప్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల బాబూరావు, ఐలు జిల్లా కార్యదర్శి కామన మునిస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక అమరవీరుల భవనంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సదస్సు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి.దక్షిణామూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రతాప్, బాబూరావు, మునిస్వామి మాట్లాడుతూ మణిపూర్‌లో శాంతి భద్రతలు క్షీణించాయని ప్రకటించి మే 4వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 355ను అమల్లోకి తెచ్చిందన్నారు. అంటే ఆ రోజు నుంచి మణిపూర్ రాష్ట్ర శాంతి భద్రతల పరిరక్షణ అధికారం కేంద్రం చేతిలోకి వచ్చిందని తెలిపారు. ఆ రోజు నుంచీ మణిపూర్‌లో జరిగిన ప్రతి హింసాకాండకూ కేంద్ర హోం శాఖా మంత్రి, ప్రధానే బాధ్యతని విమర్శించారు. బిజెపి అండదండలతో మతోన్మాదులు ప్రభుత్వం అందిస్తున్న ఆయుధాలతో ఇష్టం వచ్చినట్టు కుకి తెగ వారిని చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్‌లో దాడులకు గురౌతున్న కుకి వారికి ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలపాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మణిపూర్ ప్రజలకు మద్దతుగా కొవ్వొతులతో ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుబ్బల గోపి, ఎన్.ఆదినారాయణ బాబు, గార రంగారావు, వల్లూరి వెంకటేశ్వరరావు, గోవిందరాజు, వైటి.రామకృష్ణ, టి. వెంకటేశ్వరావు, నాగేంద్ర కుమార్, రమేష్, బ్రహ్మాజీ, బి.గోపి పాల్గొన్నారు.
మహిళలను నగంగా నడిరోడ్డుపై ఊరేగిస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నాయకులకు కన్నతల్లి కనిపించడం లేదా అని శ్రామిక మహిళా జిల్లా నాయకురాలు అడ్డగర్ల అజయకుమారి ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాల్ని ప్రశ్నించారు. మణిపూర్‌లో జరిగిన సంఘటన మహిళల హృదయాన్ని కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నతల్లి నడిరోడ్డుపై నగంగా చూస్తుంటే చట్టాలు ఏమైనాయని ప్రశ్నించారు. అత్యాచారం చేసిన వారికి కఠిన శిక్షలు పడకుండా మంత్రులే కొమ్ముకాయడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కాళ్ల : మణిపూర్‌లో మహిళలపై దాడి చేసిన వారిని ఉరితీయాలని ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ బహుజన సమైఖ్యసంఘం రాష్ట్ర అధ్యక్షులు సొడదాసి గంగయ్య డిమాండ్ చేశారు. సీసలిలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ బహుజన సమైఖ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మణిపూర్‌లో రెండు నెలల నుంచి మహిళల పట్ల హింసలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. కొంతమంది యువకులు ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి వీధుల వెంబడి నడిపించి అత్యాచారం చేసినా కేంద్రం స్పందించకపోవడం దారుణమన్నారు. కామాంధులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మైలా శ్రీనివాస్, జిల్లా నాయకులు మత్తే రాజ్‌కుమార్, బొకూరి విజయ రాజు, ముసు కుడి రాము, సొడదాసి జాకబ్, డికెవి.ప్రకాష్, ఎం.ఇస్సాక్, ఏడంగి ఏసు, వి.విజయకుమార్, గాతల సందీప్, బొర్రా పార్థు, కోనా రంజిత్, గాతల అశోక్, కమతం మహేష్ పాల్గొన్నారు.
ఆకివీడు : దేశం కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలొడ్డి పోరాడిన వీర సైనికుడి కుటుంబానికి రక్షణ లేకపోతే సామాన్యుడికి రక్షణ ఎక్కడ ఉంటుందని ఐద్వా మండల అధ్యక్షురాలు డొకల లక్ష్మి ప్రశ్నించారు. మణిపూర్ ఘటనను నిరసిస్తూ ఆదివారం సాయంత్రం స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సిపిఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ మణిపూర్‌లో స్త్రీలను నగంగా తిప్పడం హేయమైన చర్య అని తెలిపారు. సమాఖ్య పట్టణ కార్యదర్శి సంతక ఉదరు కుమారి మాట్లాడుతూ ఇటువంటి చర్యలను ప్రతి ఒక్కరూ తిప్పి కొట్టాలన్నారు. సిపిఎం పట్టణ కార్యదర్శి కె.తవిటినాయుడు, ప్రజా నాట్యమండలి జిల్లా కార్యదర్శి షేక్ వలీ, డివైఎఫ్‌ఐ జిల్లా నాయకుడు బొట్టుపల్లి రాంబాబు, జిల్లా కార్యదర్శి జి.ధనుష్ మాట్లాడారు.










