Jul 25,2023 21:36

అనంతపురంలో నిరసన వ్యక్తం చేస్తున్న సిఐటియు, ప్రజాసంఘాల నాయకులు,

         ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌    మణిపూర్‌ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. మణిపూర్‌లో ఘటనలను నిరసిస్తూ సిఐటియు, రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో నిరసన ర్యాతీ నిర్వహించారు. లలిత కళాపరిషత్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ క్లాక్‌ టవర్‌ మీదుగా మహాత్మా గాంధీ విగ్రహం వరకూ సాగి అక్కడ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డొల్లతనం వల్లే మణిపూర్‌లో మహిళలపై దాడులు, అత్యాచారాలు కొనసాగుతున్నాయన్నారు. మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించడం, సామూహిక అత్యాచారానికి పాల్పడటం హేయమైన చర్యల అన్నారు. అంతేగాకుండా మణిపూర్‌ తగలబడిపోతుంటే ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు చేయడం సిగ్గుచేటన్నారు. తక్షణమై ప్రధాని జోక్యం చేసుకుని మణిపూర్‌లో పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సూర్యనారాయణ, సిపిఎం నగర కార్యదర్శి వి.రామిరెడ్డి, సిఐటియు నగర కార్యదర్శులు ముత్తూజ, వెంకటనారాయణ, బత్తల ఆదినారాయణ, మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు ఎర్రిస్వామి, తిరుమలేష్‌, లక్ష్మీనరసమ్మ, మరియమ్మ, లక్ష్మీనారాయణ, గుర్రాజు, బాబు, భగత్‌సింగ్‌ ఆటో వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు శ్రీనివాసులు, ఆదినారాయణ, గఫూర్‌, లింగారెడ్డి, రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.