May 07,2023 21:02

తణుకురూరల్‌

అకాల వర్షాల తో నష్టపోయిన రైతుల పట్ల అవహేళనగా మాట్లాడిన మంత్రి కారుమూరి వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని సిపిఎం నాయకులు కామన మునిస్వామి, అడ్డగర్ల అజయకుమారి తెలిపారు. మంత్రి కారుమూరి వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం స్థానిక వెంకటేశ్వర సెంటర్‌లో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల పట్ల మంత్రి కారుమూరి మాట్లాడిన తీరును సిపిఎం ఖండిస్తోందన్నారు. వర్షాలకు ముందే ధాన్యం గట్టుకు చేర్చిన వారికి కూడా సంచులు ఇవ్వకపోవడం వల్లే వర్షం బారిన పడ్డారన్నారు. ఎంత డిజిటల్‌ వ్యవస్థ ఉన్నప్పటికీ రైతులకు ప్రభుత్వం ఎలాంటి మేలూ చేయలేక పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. నేను ఉన్నాను, నేను విన్నాను అనడం కాదని ఆచరణలో చూపించాలని అన్నారు. రైతులను ఓదార్చడం మాని రెచ్చగొట్టేలా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. మంత్రి బాధ్యతగా మాట్లాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పివి.ప్రతాప్‌, గార రంగారావు, వీర్రాజు, శివకుమార్‌, రామకృష్ణ, శ్రీహరి పాల్గొన్నారు.