కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గం ఎమ్మెల్యే , రాష్ట్రస్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్‌కు సొంతపార్టీలోనే అసమ్మతి సెగ చుట్టుకుంది. మంగళవారం నాడు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోయతిప్పేస్వామి స్వగృహం వద్ద నియోజకవర్గం పరిధిలోని మంత్రి వ్యతిరేక వర్గీయులు ప్రత్యేక సమవేశం ఏర్పాటు చేశారు. వైసిపి సీనియర్ నాయకులు దొణస్వామి, ములకనూరు తిమ్మరాయుడు, నారాయణపురం వెంకటేశులు, దొడగట్ట కిష్టప్ప, గూబనపల్లి భాస్కర్‌రెడ్డి, రేవన్న, గోళ్లసూరి, ఒంటిమిద్ది ఎర్రిస్వామి, హులికల్లు తిమ్మప్పలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత నాలుగేళ్లుగా మంత్రి నిర్వాకంపై తీవ్రస్థాయిలో వారు ఆరోపణలు చేశారు. పార్టీనే నమ్ముకుని గత కొన్నేళ్లుగా సేవ చేస్తున్న నాయకులను అణచివేస్తూ అక్రమ కేసులు బనాయించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్‌రెడ్డిని సిఎం చేయాలన్న తపనతో ఉషాశ్రీచరణ్‌ను గెలిపించామన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తాను రఘువీరారెడికి సహకరించానని, మంత్రి అదిష్టానానికి ఫిర్యాదు చేయడంలో వాస్తవం లేదని బోయతిప్పేస్వామి స్పష్టం చేశారు. ఈ విషయం పై తాను నమ్మే దైవం మంజునాథస్వామి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రమానానికి సిద్దం అన్నారు. ఇటీవల జరిగిన గడగడపకూ విజయోత్సవ సభలో స్థానిక నాయకులు ఏఒక్కరినీ మంత్రి పట్టించుకోలేదని అసమ్మతి నేతలు తెలిపారు. ముఖ్య నాయకులను కనీసం స్టేజ్‌పైకి కూడా పిలవకుండా అవమానించారన్నారు. ఇప్పటికైనా ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనార్టీ ప్రజలు నాయకులు, కార్యకర్తలు స్థానికులకే మద్దతు ఇవ్వాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి అధిష్టానం ఉషాశ్రీచరణ్‌కు టికెట్ ఇస్తే సహకరించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ఆమెకు కాకుండా ఎవరికి టికెట్టు ఇచ్చినా వారి గెలుపు కోసం పని చేస్తామని తెలియజేశారు. మంత్రి తీరుపై అదిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు. నియోజకవర్గ పరశీలకుడిగా ఎంఆర్‌సి రెడ్డి ఉన్నప్పటికీ ఆయన స్థానిక నాయకులు, కార్యకర్తల మనోభావాలను తెలుసుకోకుండా ఏపక్షకంగా వ్యవహరిస్తూ మంత్రికి వంత పాడుతున్నారని తెలిపారు.










