
వజ్రపుకొత్తూరు: పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రోద్బలంతోనే మంచినీళ్లపేటలో వైసిపి నాయకులు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీషను అడ్డుకున్నారని టిడిపి మండల అధ్యక్షులు సూరాడ మోహనరావు, మాజీ ఎంపిపి జి.వసంతస్వామి అన్నారు. మండలంలోని పూండిలో టిడిపి నాయకులతో కలిసి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మంచినీళ్లపేటలో బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన శిరీషను అడ్డుకోవాలని స్థానిక నాయకులు ప్రయత్నం చేయడం ఫ్యాక్షన్ రాజకీయాలను తలపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. టిడిపి నాయకులు సంయమనం పాటిస్తుంటే... అదే పనిగా మంత్రి రౌడీయిజాన్ని ప్రోత్సాహించడం దురదష్టకరమని అన్నారు. ఐదేళ్లుగా వంశధార నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతుంటే... మంత్రి ఏనాడైనా స్పందించారా? అని ప్రశ్నించారు. కాలువల్లో పూడికతీత పనులు ఈ ఐదేళ్లలో ఎప్పుడైనా చేపట్టారా? అని ప్రశ్నించారు. పూండి రోడ్డుపై నిత్యం సొంతూరు వెళ్తారా? మంత్రి స్వగ్రామానికి వెళ్లే రోడ్లు ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు. కులాలు, కుటుంబాలు మధ్య చిచ్చుపెట్టి పగ్గం గడుపుకోవాలనే మంత్రి దురాలోచన మానుకోవాలని హితవుపలికారు. జీడి పిక్కలు ధరలు రూ.14 వేలు ఉంటే... ఇప్పుడు రూ.8 వేలుకు ప్రకటించడం రైతులను దగా చేయడమే అన్నారు. టిడిపి నాయకులను అడ్డుకుంటే ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో టిడిపి నాయకులు కర్ని రమణ, గొరకల వసంతరావు, ఎ.ఉమామహేశ్వరరావు, గర్తం దానేసు, రాపాక శాంతమూర్తి పాల్గొన్నారు.