Aug 21,2023 00:25

మంత్రి ఇలాఖాలో దళితులకు ఆలయ ప్రవేశం లేదు
టిడిపి అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: సాక్షాత్తు మంత్రి రోజా సొంత నియోజకవర్గంలో దళితులను ఆలయంలోకి ప్రవేశించనియ్యకపోవడం హేయమైన చర్య అని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్‌ అన్నారు. ఆదివారం స్థానిక టిడిపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సాక్షాత్తు మంత్రి రోజా సొంత నియోజకవర్గంలోని పుత్తూరు రూరల్‌ మండలం, గొల్లపల్లి గ్రామంలో, పాలక్షమ్మ దేవాలయానికి దళితులను రానీకుండా అగ్రవర్ణాల అడ్డుకోవడం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సి ఘటన అన్నారు. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాల అయినప్పటికీ ఇదే పరిస్థితి అన్నారు. మొన్ననే స్వతంత్ర వేడుకల్ని రంగరంగ వైభవంగా చేసుకున్న 3రోజులు తిరక్క ముందే సాక్షాత్తు పుత్తూరులో, ఒక మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న తన సొంత నియోజకవర్గంలో, దళితులకు ఆలయ ప్రవేశం లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఒకపక్క దళితులకు నేను మేనమామ, అని ముఖ్యమంత్రి పెద్దపెద్ద డైలాగులు చెప్పటం కులం చూడం మతం చూడం ప్రాంతం చూడమని ఉపన్యాసాలు దంచడం ,మరోపక్క పుత్తూరు పట్టణంలో పాలాక్షమ్మ దేవాలయంలో దళితులకి ప్రవేశం లేకపోవడం, దళితుల్ని ఆలయానికి రానీయకుండా అడ్డుకోవడం అనాగరిక చర్యగా అభివర్ణించారు. సమావేశంలో టిడిపి, జిల్లా క్రిస్టియన్‌ అధ్యక్షులు మేషక్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నియోజకవర్గం అధ్యక్షుడు ప్రభుతేజ, తవణంపల్లి టిడిపి ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పట్రపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు.