Jun 27,2023 21:45

కూరగాయలు

      అనంతపురం ప్రతినిధి : మొన్నటి వరకు నిత్యావసర సరుకుల ధరలే అనుకుంటే ఇప్పుడు కాయగూరల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒక్క ఉల్లి, బంగాళదుంప మినహా అన్ని రకాల కూరగాయల ధరలు చుక్కల్లో ఉన్నాయి. అన్ని రకాల కాయగూరలు కిలో రూ.50 నుంచి రూ.100కుపైగా ధర ఉంటుండటంతో ఏమి కొనాలి, ఏమి తినాలా అని సామాన్యులు తలలుపట్టుకునే పరిస్థితి నెలకొంది.
    టమోట పంట జిల్లాలోనే అత్యధిక విస్తీర్ణంలో సాగవుతుంది. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు పెద్దఎత్తునే ఎగుమతి అవుతూ ఉండేవి. దీంతో స్థానికంగా కొంత ధర తక్కువగానే టమోటా ఉంటూ వచ్చింది. అయితే మార్చి, మే నెలల్లో వచ్చిన అకాల వర్షాలతో పెట్టిన టమోట పంట చేతికి రాలేదు. ఈ పంట మొత్తం దెబ్బతినడంతో స్థానికంగా టమోట పంట దిగుబడి లేకుండాపోయింది. సాధారణం జూన్‌ నుంచి అనంతపురం నగరంలోని అతిపెద్ద టమోట మార్కెట్‌కు పెద్దఎత్తున పంట రావాల్సింది. కాని ఇప్పటికీ రాలేదు. ఎక్కడా టమోట దొరక్కపోవడంతో మార్కెట్‌లో దీనికి డిమాండ్‌ పెరిగింది. దీంతో మొన్నటి వరకు కిలో రూ.15 వరకు టమోట ధర ఉండేది. ఇప్పుడు అమాంతంగా పెరిగి వంద రూపాయలకు చేరవైంది. హోల్‌సేల్‌ మార్కెట్‌లోనే కిలో టమోట ధర రూ.80 ఉంటోంది. రిటైల్‌కు వచ్చే సరికి కిలో రూ.120 వరకు ఉంటోంది. ఇదే బాటలో పచ్చి మిరపకాయలు కూడా కిలో రూ.80 వరకు హోల్‌సేల్‌లో ఉంది. రిటైల్‌లో ఇది కూడా వంద రూపాయలకుపైగా కిలో ఉంది. ఇక బెండ, వంకాయ, క్యారెట్‌ వంటివి కూడా కిలో రూ.60 వరకు ధర ఉంది. ఇంత పెద్దఎత్తున ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో ఏమి కోనాలి... ఏమి తినాలో అంటూ సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ ధరల్లో ఏమి కొని తినగలం
ఆరీఫా సుల్తానా, గృహణి, అనంతపురం నగరం.

      కాయగూరల ధరలు అన్ని కిలో వంద రూపాయలకు దగ్గరగా ఉన్నాయి. కనీసం పచ్చడి చేసుకుని తినాలి అన్నా టమోట, మిర్చి అవసరం అవుతాయి. అవికూడా వంద రూపాయల చేరవయ్యాయి. ఇక చికెన్‌ ధరలు కూడా ఈ కాలంలో రూ.300కు చేరవ అవుతోంది. ఇలాగుంటే సామాన్యులు ఏమి కొని తినగలం. ఈ ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
సావిత్రి, ఐద్వా రాష్ట్ర నాయకులు.

    ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగాయి. దీనికితోడు కాయగూరల ధర పెరిగితే సామాన్యుడు ఏమి కొని తినగలడు. ప్రభుత్వం ఈ ధరల నియంత్రణపై దృష్టి సారించాలి. రైతు బజారుల్లో అందుబాటు ధరల్లో వీటిని ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలి.