
* ఈనెల 15 తుది గడువు
* ఇప్పటివరకు 72 శాతమే పూర్తి
* సాంకేతిక సమస్యలతో జాప్యం
* నమోదు ఆలస్యం కావడంతో నెలాఖరుకు గడువు పెంపు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: జిల్లాలో ఈ-క్రాప్ నమోదు మందకొడిగా సాగుతోంది. పంటల కొనుగోలు, వరదలు, తుపాన్ల సమయంలో ఇన్సూరెన్స్ తదితర సౌకర్యాల వర్తింపునకు మూడేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఏడాది ఈ-క్రాప్ బుకింగ్‌లో ప్రభుత్వం కొత్త మార్పు తీసుకొచ్చింది. గతంలో రైతు సాగు చేసిన పంటకు మాత్రమే ఫొటో అప్‌లోడ్ చేయగా, కొత్త విధానంలో పొలంలో రైతు ఉంటుండగా ఫొటో తీసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. పంటల బుకింగ్ ప్రక్రియలో పలు అంశాలు నమోదు చేయాల్సి రావడం, వాటికితోడు సాంకేతిక సమస్యలు జత కావడంతో ఈ-క్రాప్ నెమ్మదిగా సాగుతోంది. పంటల బుకింగ్‌కు ప్రభుత్వం ఈనెల 15వ తేదీని గడువుగా నిర్ణయించింది. ఇప్పటివరకు 70 శాతం వరకే జరగడంతో నెలాఖరు వరకు పొడిగించింది.
జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ, ఉద్యాన పంటలు కలిసి ఐదు లక్షల ఎకరాలు సాధారణ సాగుగా ఉంది. ప్రస్తుతం 4,42,775 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఇప్పటివరకు 3,17,167 ఎకరాలను (72 శాతం) నమోదు చేశారు. గత నెల మొదటి వారంలో ఈ ప్రక్రియను ప్రారంభించారు. మూడేళ్లుగా ఈ-క్రాపింగ్ చేపడుతునాన, ఈ ఏడాది ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంతో అటు రైతులు, ఇటు సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్‌బికెల్లో పనిచేసే వ్యవసాయశాఖ అసిస్టెంట్లు, వ్యవసాయ అనుబంధ శాఖల సిబ్బంది పొలం వద్దకు వెళ్లి భూమి సబ్ డివిజన్ సర్వే నంబర్ల ఆధారంగా పంట వివరాలను నమోదు చేస్తున్నారు. రైతుల ఫొటోలను అప్‌లోడ్ చేస్తున్నారు. భూమి సర్వే నంబర్లు, పాస్ పుస్తకాల ఖాతాల నంబర్లు, ఏ పంట వేశారో నమోదు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఫార్మాట్‌లో తప్పులు లేకుండా వివరాలు నమోదు చేయాల్సి ఉండడంతో ఎక్కువ సమయం పడుతోంది.
పంటల నమోదు పరిస్థితి ఇలా...
వ్యవసాయ శాఖకు జిల్లాలో ఏడు సబ్ డివిజన్లు ఉన్నాయి. అందులో నరసన్నపేట సబ్ డివిజన్‌లో 39,450 ఎకరాల్లో పంటల బుకింగ్ జరిగింది. రణస్థలం డివిజన్‌లో 28,778 ఎకరాల మేర వివరాలు నమోదయ్యాయి. పలాసలో 38,287 ఎకరాలకు సంబంధించిన వివరాలను సేకరించారు. శ్రీకాకుళం డివిజన్‌లో 27,960 ఎకరాల వరకు నమోదయ్యాయి. సోంపేటలో 20,853 ఎకరాలను నమోదు చేశారు. టెక్కలిలో 42,747 ఎకరాలు, కొత్తూరు డివిజన్‌లో 31,433 ఎకరాలు ఈ-క్రాప్‌లో నమోదయ్యాయి.
వివరాల నమోదుకు సర్వర్ సమస్యలు
పంటలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో సాంకేతిక సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అంతా ఒకేసారి ప్రయత్నిస్తుండడంతో సర్వర్ సమస్యలు తలెత్తుతున్నట్లు సిబ్బంది చెప్తున్నారు. పైగా కొన్నిచోట్ల సిగల్స్ లేకపోవడంతో అప్‌లోడ్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యాప్‌లో లోపాలతో జియోట్యాగింగ్ సరిగా జరగడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. ఫలితంగా పంటల నమోదు ప్రక్రియ చాలా మందకొడిగా సాగుతోంది. రైతుభరోసా కేంద్రాల్లో సిబ్బంది కొరత ఉండడంతో పంటల సాగు ముందుకు సాగడం లేదు.
పనిఒత్తిడితో సిబ్బంది సతమతం
ఒక విఎఎ రోజుకు ఆరు ఎకరాల వరకు జియోట్యాగింగ్ చేయాలని స్పష్టం చేసింది. ప్రతి సర్వే నంబరుకు, అదేవిధంగా ఆయా సర్వే నంబర్లలోని సబ్ డివిజన్లకు వెళ్లి జియోట్యాగింగ్ ద్వారా ఈ-క్రాప్ నమోదు చేస్తున్నారు. గతంలో కార్యాలయాల్లో కూర్చొని రైతులు తీసుకొచ్చిన పట్టాదారు పాసు పుస్తకాలు, ఒన్ బి ద్వారా పంట నమోదు చేసే పరిస్థితి ఉండేది. సిగల్ లేని చోట, కొండల పైకి వెళ్లలేని సందర్భంలో రైతులు అందించే వివరాలతో ఈ-క్రాప్ చేసే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. క్షేత్రస్థాయికి వెళ్తే గానీ పని జరిగే అవకాశం లేదు. పొలాలకు వెళ్లి పంట వివరాలు, రైతు ఫొటోలను తీసి అప్‌లోడ్ చేస్తే గానీ జియోట్యాగింగ్ పూర్తయ్యే పరిస్థితి లేదు. దీంతో విఎఎలు, విహెచ్‌ఎలు కొంత పనిఒత్తిడికి లోనవుతున్నారు.
రైతులకు తప్పని అవస్థలు
ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంతో అటు రైతులకూ ఇబ్బందులు తప్పడం లేదు. భూములను కౌలుకు ఇచ్చి వలస వెళ్లిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో వారు రాకుండానే పంట ఈ-క్రాప్‌లో నమోదయ్యే పరిస్థితి ఉండేది. జియోట్యాగింగ్ పద్ధతిలో వారు తప్పనిసరిగా రావాల్సి వస్తోంది. పంటను ఏదో విధంగా అమ్ముకుందామనుకున్నా ఈ-క్రాప్ చేయించకపోతే ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో, కొందరు సొంత గ్రామాలకు వస్తున్నారు. భూమిని కౌలుకు ఇచ్చిన వారు మాత్రం రావడానికి ఇష్టపడడం లేదు.
ఈ-క్రాప్ వేగవంతానికి చర్యలు
ఈ-క్రాప్‌ను వేగవంతం చేసేలా చర్యలు చేపడుతున్నాం. పంటలు సాగు చేస్తున్న రైతుల వివరాలను నమోదు చేస్తాం. సర్వర్ సమస్యలు వల్ల పంటల సాగు ముందుకు సాగడం లేదు. పంటల నమోదుకు ప్రభుత్వం నెలాఖరు వరకు గడువు పెంచింది. రైతులంతా తమ వివరాలను నమోదు చేసుకోవాలి.
- కె.శ్రీధర్, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు