Jun 10,2023 22:37

పాలకోడేరు మంచినీటి చెరువులో చనిపోయిన చేపలు
పట్టించుకోని పంచాయతీ అధికారులు
అనారోగ్యానికి గురవుతున్న గ్రామస్తులు
ప్రజాశక్తి - పాలకోడేరు

             మండల కేంద్రమైన పాలకోడేరులో ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు కరువైంది. గ్రామంలోని ప్రజలకు పరిశుభ్రమైన తాగునీటిని, మౌలిక వసతులు కల్పించాలని పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామస్తులు ఎప్పటికప్పుడు గగ్గోలు పెడుతున్నా ఇక్కడ మాత్రం సమస్యలు పరిష్కారం కావట్లేదు. పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న రమాలీల నిర్లక్ష్య వైఖరి కారణంగా కనీసం ప్రజలకు పరిశుభ్రమైన నీరు దక్కడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దుర్వాసన వెదజల్లుతున్న చెరువు
పంచాయతీకి సమీపంలో ఉన్న తాగునీటి చెరువులో చేపలు చనిపోయి, పసర్లు పట్టి చెరువు అంత దుర్వాసన వెదజల్లుతున్నా కనీసం పట్టించుకోవడంలేదు. చెరువులో నీరు అడుగంటినప్పుడు, పసర్లు పట్టినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల్లో తాగునీటిని సరఫరా చేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టకుండా విషయం బయటకు పొక్కినప్పుడు మాత్రమే కంటితడుపుగా చర్యలు చేపడుతున్నారు. కుళాయిలకు సరఫరా చేసే నీరు తాగలేకపోవడంతో గ్రామస్తులు భీమవరం ప్రజలకు తాగునీరు అందించే పైపులు, చెరువు వద్దకు వెళ్లి ప్రతిరోజు నీరు తెచ్చుకుంటూ ఉంటారు. అంత దూరం వెళ్లి రాలేని వారు ఈ నీటిని తాగి అనారోగ్యాల పాలవుతున్నారు. పరిశుభ్రమైన తాగునీరు అందిస్తున్నామని రికార్డుల్లో లెక్కలు రాసుకోవడం తప్ప వాస్తవంగా చేసే ఖర్చుల్లో ఎంతో వ్యత్యాసం ఉన్నట్లు వార్డు సభ్యులే బోర్డు సమావేశాల్లో బహిరంగంగా ఆరోపిస్తున్నారు. పరిశుభ్రమైన నీరు అందించకుండా రూ.లక్షల ఖర్చు చేశామంటూ నిధులు డ్రా చేసుకుని దుర్యినియోగం చేస్తున్నారని దీనిపై జిల్లా స్థాయి అధికారులు విచారణ జరపాలని వారు కోరుతున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి రమాలీలను వివరణ కోరగా పంచాయతీ సమీపంలో చెరువులో చేపలు చనిపోవడం వాస్తవమేనన్నారు. మరో చెరువు నీటిని, బోరు నీటిని కలిపి గ్రామస్తులకు సరఫరా చేస్తున్నామని తెలిపారు.