ప్రజాశక్తి-ఉరవకొండ పదవ తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ఓబులేసు పిలుపునిచ్చారు. ఉరవకొండలోని వాణి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కరస్పాండెంట్ రఘురాములు ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులు శనివారం సరస్వతి పూజ నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలన్నారు. పరీక్షలు రాసే సమయంలో ఒత్తిడికి గురికాకుండా మానసికంగా దృఢంగా ఉండాలన్నారు. పది పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడం ద్వారా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు అట్టలు, పెన్నులు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తిప్పయ్య, పెన్నహోబిలం ఆలయ మాజీ ఛైర్మన్ అశోక్ కుమార్, ఉరవకొండ పిఎసిఎస్ డైరెక్టర్ ప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.










