Sep 06,2022 23:36

మళ్లీ టమాటా మోత
కేజీ రూ. 50లు పలుకుతున్న వైనం
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి

వారం క్రితం వరకు వినియోగదారులకు అందుబాటులో ఉన్న టమాటా ధరలు మూడు రోజులుగా పెరుగుతున్నాయి. బహిరంగ మార్కెట్‌ కేజీ రూ.40 నుంచి రూ.60ల వరకు వ్యాపారస్తులు అమ్ముతున్నారు. ఈ ధర మరింత పెరుగుతుందని ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న పరిస్థితిని బట్టి చెప్పొచ్చని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
ఖరీఫ్‌లో సాగు చేసిన టమాటా పంట ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఈ నెల ఒకటో తేదీ నుంచి మార్కెట్‌కు పంటరావడం కూడా గణనీయంగా తగ్గిపోయింది. 31వ తేదీ నాటికి దాదాపు 450 టన్నుల సరుకు వచ్చేది. అయితే మంగళవారం నాటికి 148 టన్నులు పంట మాత్రమే మార్కెట్‌కు చేరింది. డిమాండు పెరగడం వల్ల ధరలు పెరుగుతున్నాయి. మదనపల్లి మార్కెట్‌లో మంగళవారం అత్యధికంగా కేజీ రూ.50లు పలికింది. మన జిల్లాలో టమాటా సాధారణ సాగు 17వేల ఎకరాలు, కాగా 18వేల ఎకరాలకు పైగా సాగు నమోయ్యింది. మే, జూన్‌, జూలై నెలల్లో దిగుబడులు అత్యధికంగా ప్రతిరోజూ మార్కెట్‌కు 1600 టన్నులకు పైగానే వచ్చేది. దీంతో ధరలు విపరీతంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం పంట కోత 7,8వ దశలకు చేరుకున్నాయి. దీంతో దిగుబడి తగ్గిపోతూ వస్తోంది. అంతేకాకుండా మార్కెట్‌కు నాణ్యమైన సరుకు కూడా రావడం తగ్గిపోతోంది. వెరసి ధరలు టమాటా ధరలు పెరుగుతున్నాయి. మరో వారం వరకు ఈ ధరలు పెరుగూ పోతాయని అధికారులు చెబుతున్నారు.