మళ్లీ తెరపైకి ట్రూఆఫ్ ఛార్జీలు బాదుడు
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
మళ్లీ తెరపైకి ట్రూఆఫ్ ఛార్జీలు వస్తున్నాయి. 2014 నుంచి వాడిన కరెంటును నెలనెలా బిల్లులకు కలిపి ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ఇప్పటికే కరెంటు బిల్లులతో అల్లాడుతున్న సామాన్యులకు ఈ ఛార్జీలతో మరింత భారం పడనుంది. దాదాపు 36నెలల పాటు దీన్ని మోయాల్సి రానుంది. దీనిపై పేదలు, మధ్య తరగతి వారు అల్లాడుతున్నారు. 2014-19కి మధ్యకాలంలో విద్యుత్ వినియోగానికి సంబంధించి ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ఒక్కో యూనిట్‌కు రూ.23పైసలు చెప్పున వసూలు చేసేందుకు ఎపిఇఆర్‌సి ఎస్‌పిడిసిఎల్‌కు అనుమతినిచ్చింది. ఇందులో భాగంగా మన జిల్లాపై దాదాపు రూ.5కోట్లపైనే భారం పడనుంది. ఈ 36నెలలకు సంబంధించి రూ.300కోట్లు వసూలు చేయనుంది. ఈ నెల నుంచి దీన్ని అమలు చేసేందుకు అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో బిల్లులు వసూలు చేస్తున్నారు. అద్దెకు ఇళ్లల్లో కాపురం ఉన్న వారికి పరిస్థితి మరీ ఘోరంగా మారనుంది. ఎవరో వాడిన కరెంటుకు వీరు బిల్లు చెల్లించాల్సి వస్తుంది. బిల్లులు అధికంగా వస్తే యజమానులతో వాగ్వాదానికి దిగే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ట్రూ ఆఫ్ ఛార్జీలు తామెందుకు చెల్లించాలని ప్రశ్నించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచింది. దీంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై అందరిలోనూ ఆగ్రహం ఉంది. ఇప్పుడు వెంటనే ట్రూ ఆఫ్ ఛార్జీలను పెంచడం వల్ల వారికి కరెంటు బిల్లులు చూస్తేనే చిర్రెత్తుకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఏడాది ఇదేవిధంగా ట్రూఆఫ్ ఛార్జీలను వసూలు చేయడం వల్ల ప్రజల్లో తీవ్రఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ప్రభుత్వం వెనక్కు తగ్గి వస్తున్న కరెంటు బిల్లుల్లోనే దాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా మళ్లీ ట్రూఆఫ్ ఛార్జీలను వసూలు చేయాలని చూస్తోంది. దీనిపైన కూడా ప్రజాసంఘాలు కన్నెర్రజేస్తున్నాయి. వెంటే ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండు చేస్తున్నారు.










