ప్రాజెక్టులకు నిధుల లేమి
కార్మికులను పట్టించుకోని వైనం
జిల్లాకు ఒరిగింది ఏమీ లేదు
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
ఇది వరకు అమలు చేస్తున్న 'నవరత్నాల' పథకాలు తప్ప కొత్తవి ఏవీ అమలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు అసలు నిధులే కేటాయించలేదు. జిల్లాకు కొత్తగా వరాలు ఏవీ లేవు. ఇక పోరాటాలు చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు కూడా ఏ హామీ దక్కలేదు. బడ్జెట్ చాలా నిస్సారంగా ఉంది. పద్దుల చిట్టా వల్లె వేయడం తప్ప ఏమీ లేకుండా పోయింది.
రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో మన జిల్లాకు ప్రత్యేకంగా కేటాయింపులు ఏమీ లేకుండా పోయాయి. ఖర్చుల్లో అనేక సామాజిక తరగతులకు, మహిళలకు భారీగా ఖర్చు పెట్టబోతున్నట్లు చూపించారు. అయితే గడిచిన రెండు బడ్జెట్‌లో వీరికి కేటాయించిన నిధులు ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. నవరత్నాలకు తప్ప మరే కార్యక్రమానికి ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టనందు వల్ల దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు పెదవి విరుస్తున్నారు.
రైతాంగానికి ఒరిగింది నామమాత్రమే
రైతాంగానికి ఈ బడ్జెట్‌లో పెద్దగా ప్రత్యేకత లేకుండా పోయింది. ముఖ్యంగా మన జిల్లాలో పడమటి ప్రాంతాల్లో టమాటా పంట రైతులకు జూదంలా మారింది. ఇందులోని సంక్షోభానికి తగిన ప్రణాళికలు రూపొందించడంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. అలాగే మూతపడిన సహకార షుగర్ ఫ్యాక్టరీల విషయంలో కూడా ఇదే విధంగా అనుసరించారు. ఏ మాత్రం నిధులు కేటాయింపు లేకుండా పోయింది. ఇక విజయడెయిరీకి కూడా స్పష్టమైన హామీ దానికి నిధులు కేటాయింపులు ఇవ్వలేదు. వైఎస్‌ఆర్ రైతు భరోసా, కిసాన్ యోజన పథకాలకు నిధులు ఇవ్వడం, గతంలో ప్రవేశపెటిన ఉచిత పంటల భీమా తప్ప ఏమీ లేకుండా పోయింది. అలాగే నియోజక వర్గానికి ఒక వ్యవసాయ పరీక్ష కేంద్రాలను తీసుకొచ్చేందుకు నిధులు ఇస్తున్నట్లు ప్రకటించారు. మన జిల్లాలో 14 కేంద్రాలు వచ్చే అవకాశం ఉంది.
నిధులు పారలేదు
బడ్జెట్ అనగానే ప్రధానంగా మనకు గుర్తొచ్చేది సాగునీటి ప్రాజెక్టులు. హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టుల పనులు ఎక్కడి కక్కడే ఆగిపోయాయి. గత ఏడాది ఇచ్చిన నిధులు కూడా ఖర్చుకాలేదు. ఈ ఏడాది కేటాయించిన నిధులను కూడా ఇవ్వలేదు. దీంతో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనేవిధంగా తయారైంది. గండికోట రిజర్వాయర్‌కు అదనంగా 10వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు 2022 ఆగస్టు నాటికి అవుకు టెన్నెల్ రెండో దశ పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నట్లు మంత్రి బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు.
ఎస్‌సి, ఎస్‌టిలకు ఒరిగింది శూన్యమే
ఎస్‌సి, ఎస్‌టిల కోసం నిర్ణయించిన సబ్‌ప్లాన్ నిధులు ప్రభుత్వం ఖర్చు పెట్టడం లేదు. వీరికి కేటాయింపులు చేస్తున్నారు. వినియోగించిన పాపాన పోలేదు. వెనుకబడిన గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులు కూడా ఖర్చు పెట్టలేదు. గత ఏడాది కేటాయించిన నిధులు కూడా ఈ సారి కేటాయించలేదు. కేవలం ఎనిమిది శాతానికి మించి పెరిగింది లేదు.
అంకెల గారడి : వాడా గంగరాజు, సిపిఎం
ఈ ఆర్థిక సంవత్సరానికి 2 లక్షల 56వేల కోట్ల భారీ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆదాయం పెంచుకునే ఆలోచనలో ప్రభుత్వం లేదు. నిశితంగా పరిశీలిస్తే బడ్జెట్ అంకెల గారడీగా ఉంది. మూలధన, రెవెన్యూ వ్యయం సమతుల్యంగా ఉన్నపుడే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అయితే ఈ బడ్జెట్లో దానికి విరుద్ధంగా మూలధన వ్యయం 1/5 ఉంటే రెవిన్యూ 4/5 గా వుంది. నిధులు కేటాయించక ఇఎస్‌ఐ ఆసుపత్రిలో మందులు అందక కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. అంగన్వాడి, ఆశ, మిడ్ డే మీల్స్, ఐకెపి లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు సంబంధించి బడ్జెట్లో ప్రస్తావనే లేదు.
వాడా గంగరాజు, సిపిఎం కార్యదర్శి










