తాత్కాలిక పనులతో సరి.. కానరాని శాశ్వత పరిష్కారం
పొలమూరు జగనన్న లేఅవుట్‌లోకి మరోసారి నీళ్లు
స్పందించని జిల్లా అధికారులు
ప్రజాశక్తి - పెనుమంట్ర
అకాల వర్షాల ప్రభావంతో పొలమూరు సచివాలయం వెనుకనున్న జగనన్న లేఅవుట్ మరోసారి నీట మునిగింది. పై నుంచి వర్షపు నీరు, పక్కనుంచి పొలాల్లోని సాగునీరు లేఅవుట్‌లోకి ప్రవేశించడంతో అక్కడ అడుగు పెట్టలేని దుస్థితి ఏర్పడిందని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే అక్కడ ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నవారైతే రోజువారీ అవసరాలకు ఎలా వెళ్లాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.
గతంలోనే ఈ లేవుట్ దుస్థితిని 'లేఅవుట్‌లోకి నీళ్లు.. లబ్ధిదారులకు కన్నీళ్లు' శీర్షికన ప్రజాశక్తి కథనాన్ని ప్రచురించింది. నాడు మండల, గ్రామస్థాయి అధికారులు స్పందించి పొలాల్లో నీరు లేఅవుట్‌లోకి రాకుండా తాత్కాలికంగా అడ్డుకట్ట వేశారు. అయితే తాత్కాలికమే కావడం, లేఅవుట్ పల్లంగానే ఉండటంతో ఆ ప్రాంతంలోకి నీటి ఊట చేరుతూనే ఉంది. తాజాగా వర్షాలకు లేఅవుట్‌లోకి నీరు చేరగా.. 'గోరుచుట్టుపై రోకలి పోటు' చందంగా పక్కనే ఉన్న పొలాల్లోని నీరు లేఅవుట్‌ను ముంచెత్తింది. కొద్దిరోజుల క్రితమే ఆ ప్రాంతంలో సుమారు నలుగురు లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుత పరిస్థితితో ఇళ్ల నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది. మెటీరియల్ లోపలికి తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో సచివాలయం వద్ద భవన నిర్మాణ మెటీరియల్ దిగుమతి చేసుకుని అక్కడ నుంచి కూలీలచే మోయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఒక్కో లబ్ధిదారునికి సుమారు రూ.15 వేల నుంచి రూ.20 వేలు వరకూ అదనంగా ఖర్చయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంతోపాటు రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్, తాగునీరు వంటి సౌకర్యాలు త్వరితగతిన ఏర్పాటు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఈ విషయంపై ఎంపిడిఒ వి.పూర్ణబాబ్జిని వివరణ కోరగా వెంటనే సమస్యను పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శి ఎస్.మోహన్‌రావు, ఇంజినీరింగ్ అసిస్టెంట్ నరసింహను ఆదేశించానని తెలిపారు.










