ప్రజాశక్తి - కాళ్ల
వేసవి దాహార్తిని తీర్చడానికి మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషదాయకమని డిసిసిబి ఛైర్మన్, వైసిపి ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎల్.నరసింహరాజు అన్నారు. పెదఅమిరం గ్రామంలో గ్రామపంచాయతీ సహకారంతో సర్పంచి డొక్కు సోమేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మజ్జిగ చలివేంద్రాన్ని పివిఎల్.నరసింహరాజు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పివిఎల్ నరసింహరాజు మాట్లాడుతూ వేసవిలో వాహనదారులకు, పాదచారులకు మజ్జిగ చలివేంద్రాలు ఎంతో దోహదపడుతున్నాయన్నారు. సర్పంచి డొక్కు సోమేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రజలకు అందుబాటులో ప్రధాన రహదారి వెంబడి మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచి జవ్వాది లీలా కిషోర్, పార్టీ గ్రామ అధ్యక్షులు వేగేశ్న జయ రామకృష్ణంరాజు, సత్యనారాయణ, నడింపల్లి సుబ్బరాజు, జైకృష్ణ పాల్గొన్నారు.
గణపవరం : వేసవిలో బాటసారులకు దాహార్తిని తీర్చే చలివేంద్రాలు ఏర్పాటు చేయడం హర్షణీయమని వైసిపి మండల కన్వీనర్ దండు రాము అన్నారు. స్థానిక బస్టాండ్ వద్ద స్నేహ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో వర్కర్స్ యూనియన్ కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు సమాజ సేవలో కూడా భాగం పంచుకోవడం సంతోషకరమన్నారు. మొదటి రోజు గణేష్ రెస్టారెంట్ వారి సౌజన్యంతో రస్నా అందించారు.










