తిరుపతిలో 'సర్వీస్'స్కూటర్ల సౌలభ్యం
కిలోమీటర్‌కు రూ.15మాత్రమే వసూలు
'రాపిడో' యాప్‌లో అందుబాటులోకి..
ప్రజాశక్తి - తిరుపతి సిటి
దానికి తోడు ఇటీవల ఆటోలను ఆన్‌లైన్లో బుక్ చేసుకునే సౌలభ్యం కల్గింది. ఇప్పడు మరో అడుగు ముందుకేసి అద్దెకు స్కూటర్లను బుక్‌చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. రాపిడో యాప్‌ను తమ స్మార్టుఫోన్లో డౌన్‌లోడు చేసుకోవాలి. అందులో ఆప్షన్స్ ఉంటాయి. కారు కావాలో.. ఆటో కావాలో..స్కూటరు కావాలో ఎంపిక చేసుకోవాలి. అంతే వారికి అవసరమైన వాహనాలకు సంబంధించిన ఫోన్ నెంబర్లు డిసిప్లేపై కనబడతాయి. వాటిలో ఒకదాన్ని ఎంపిక చేసుకుంటే మీరు ప్రయాణించే ప్రాంతానికి అతి చేరువలో ఉన్న వాహనదారుడికి సమాచారం అందుతుంది. వెనువెంటనే అతి తక్కువ సమయంలో వాహనంతో సహ డ్రైవర్లు మీ ఇంటి ముందు ప్రత్యక్షమవుతాడు.
యాంత్రిక జీవితంలో ప్రతిక్షణం పరుగులతో కూడుకున్న బతుకే. ఉదయం లేచింది మొదలుకుని, రాత్రి పడుకునే వరకు అంతా ఉరుకులు పరుగులే. సమయంతో పోటీపడుతూ సాగుతున్న జీవితంలో అనుక్షణం అవసరమే. సమయాన్ని వృధా చేయకూడదు. ఇంటి నుంచి అడుగు బయటపెడితే తొందరగా గమ్యస్థానం చేరుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నాం. కోటేశ్వర్లు రకరకాల సొంత కార్లలో గంటకు 200 నుంచి 300 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించే వాహనాలను కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసి రాకపోకలు సాగిస్తుంటారు. లక్షాధికారులు ఓ మోస్తరు లక్షల రూపాయల్లో కార్లు కొనుగోలు చేస్తుంటారు. మధ్యతరగతి ప్రజలు కనీసం ద్విచక్ర వాహనాలు (టువీలర్లు) అప్పోసొప్పో చేసుకుని టైంతో పోటీ పడుతూ జీవితాన్ని సాగదీస్తున్నారు. సామాన్యులు, రెక్కాడితే గాని డొక్కాడని ప్రజలు సమయానికి పని చేసే చోటుకు చేరుకునేందుకు తమ స్తోమతను దృష్టిలో ఉంచుకుని ఎక్కువుగా షేర్ ఆటోలను ఆశ్రయిస్తారు. ఇప్పడు ఏ నగరంలో, పట్టణాల్లో చూసినా షేర్ ఆటోల హవానే ఎక్కువ. ఆఖరికి మారుమూల గ్రామీణ ప్రాంతాలకు సైతం పల్లెవాసులకు రవాణా సౌకర్యం అందిస్తున్నది షేర్ ఆటోలే అంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి తరుణంలో సామాన్యులు, మద్యతరగతి ప్రజలకు సరికొత్త రవాణా సౌకర్యం తోడైంది. తిరుపతి అధ్యాత్మిక క్షేత్రంలో సర్వీసు బైక్‌లు (అద్దె స్కూటర్లు) అందుబాటులోకి వచ్చాయి.
'అద్దె' అతి తక్కువ
మీరు వెళ్లే గమ్యానికి క్షేమంగా చేర్చుతాడు. వామ్మో ఆన్‌లైన్ బుకింగ్, ఇంటి వద్దకే వాహనం అంటే అద్దె పెద్ద మొత్తంలో ఉంటుందనుకునేరు... అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. షేర్ ఆటోలకు ఇచ్చే అద్దె డబ్బులతోనే స్కూటర్‌పై ప్రయాణించొచ్చు. కఫిలతీర్ధంనుంచి బస్టాండుకు, అలిపిరి నుంచి కఫిలతీర్ధం, మున్సిపల్ కార్యాలయం నుంచి అన్నారావు సర్కిల్, గోవిందరాజుల గుడి నుంచి బాలాజీకాలనీ, అన్నమయ్య సర్కిల్ నుంచి బస్టాండు వంటి మార్గాల్లో ప్రయాణించాలంటే కేవలం మనిషికి 20 రూపాయలు మాత్రమే. అలిపిరి నుంచి తిరుచానూరు వంటి ప్రాంతాలకు ప్రయాణించాలంటే కిలోమీటరుకు కేవలం 15 రూపాయలు మాత్రమే వసూళ్లు చేస్తారు. పైగా ఒక స్కూటర్లో ఒకర్ని మాత్రమే ఎక్కించుకోవడం గమనార్హం. షేర్ ఆటోలు, వోలో కార్లు మెయిన్‌రోడ్డు వరకు మాత్రమే వస్తాయి, స్కూటర్లు బుక్ చేసుకుంటే మీ ఇంటి ముంగిటికే వస్తాయి. పైగా ఇరుకు ప్రయాణం లేకుండా ఒకరు మాత్రమే కంఫర్టుగా ప్రయాణించే అవకాశం. ఇప్పడు యువత, సామాన్యులు సైతం సర్వీసు బైక్‌లపైనే ఆసక్తి పెంచుకుంటున్నారు. రానున్న రోజుల్లో వాటి హవానే కొనసాగినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.










